హైదరాబాద్, వెలుగు: రాష్ట్రాన్ని డ్రగ్స్ రహిత రాష్ట్రంగా మార్చేందుకు అవసరమైన చర్యలు చేపట్టామని టీజీ యాంటీ నార్కొటిక్స్ బ్యూరో(టీజీ న్యాబ్) డైరెక్టర్ సందీప్ శాండిల్యా అన్నారు. పల్లె నుంచి పట్నం దాకా అన్ని విద్యాసంస్థలు, బస్తీలు, కాలనీల్లో 2 లక్షల మందితో అవగాహన కల్పించనున్నట్లు వెల్లడించారు. డ్రగ్స్, గంజాయిపై అవగాహన కార్యక్రమాల కోసం జూబ్లీహిల్స్‌లోని ఎమ్‌సీఆర్‌హెచ్‌ఆర్‌డీఐ సెంటర్లో బుధవారం నాలుగు రోజుల శిక్షణ ప్రోగ్రామ్ ప్రారంభమైంది. దీన్ని సందీప్ శాండిల్యా ప్రారంభించి మాట్లాడారు.
రాష్ట్ర వ్యాప్తంగా వివిధ విభాగాలకు చెందిన 940 మందికి ప్రస్తుతం శిక్షణ అందజేస్తున్నామని తెలిపారు. మాదకద్రవ్యాలను అరికట్టేందుకు యువత, పేరెంట్స్, టీచర్లు, స్వచ్చంద సంస్థల ప్రతినిధులు, డాక్టర్లు, ఆశావర్కర్లు, అంగన్‌వాడీలు, ఏఎన్ఎంలు, విలేజ్ అసిస్టెంట్లు సహా మొత్తం 2 లక్షల మందిని భాగస్వామ్యం చేస్తున్నట్లు వెల్లడించారు. ఇప్పటికే ఏర్పాటు చేసిన 4,511 ప్రహరీ క్లబ్బులు/యాంటీ డ్రగ్ కమిటీల ద్వారా 16,477 విద్యాసంస్థల్లో అవగాహన కార్యక్రమాలు చేపడ్తామన్నారు. విద్యాసంస్థలు,రద్దీ ప్రాంతాలు, కాలనీలు, బస్తీల్లో విస్తృతంగా పర్యటించి విద్యార్థులు, యువతలో అవగాహన కల్పిస్తామని సందీప్ శాండిల్యా తెలిపారు.