హెచ్ఎండీఏ పంచాయతీల్లోనూ.. టీజీ బీపాస్

హెచ్ఎండీఏ పంచాయతీల్లోనూ.. టీజీ బీపాస్
  • ఈ నెలాఖరు నుంచి అమలుకు అధికారుల నిర్ణయం 
  • ప్రస్తుతం ఇక్కడి పంచాయతీలు, మున్సిపాలిటీల్లో డీపీఎంఎస్ అమలు 
  • దీనివల్ల లేఅవుట్స్, భవన నిర్మాణ అనుమతులు ఆలస్యం 
  • టీజీబీపాస్​తో ఇకపై వేగంగా పర్మిషన్లు.. హెచ్ఎండీఏకు భారీగా ఆదాయం వచ్చే చాన్స్   

హైదరాబాద్, వెలుగు : హైదరాబాద్ ​మెట్రో పాలిటన్ డెవలప్​మెంట్ అథారిటీ(హెచ్ఎండీఏ) పరిధిలోని అన్ని గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీల్లోనూ ఇకపై భవన నిర్మాణ, లేఅవుట్ అనుమతులన్నీ టీజీ బీపాస్ ద్వారానే జారీ చేయాలని అధికారులు నిర్ణయించారు. ప్రస్తుతం అమలులో ఉన్న డెవలప్​మెంట్ పర్మిషన్ మేనేజ్ మెంట్ సిస్టమ్(డీపీఎంఎస్) విధానాన్ని నిలిపి వేయనున్నారు. టీజీ బీపాస్ ​(స్వీయ ధృవీకరణ వ్యవస్థ) ద్వారానే గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీల్లోనూ అనుమతి ఇవ్వనున్నారు. ప్రస్తుతం కార్పొరేషన్​ల పరిధిలోనే భారీ భవన నిర్మాణాలు, లేఅవుట్స్, కొత్త వెంచర్లకు టీజీ బీపాస్​ను అమలు చేస్తున్నారు. ఎన్నికల కోడ్ ముగియడంతో హైదరాబాద్​నగరంలో రియల్​ఎస్టేట్ పుంజుకునే అవకాశం వుందని హెచ్ఎండీఏ అధికారులు భావిస్తున్నారు. నిజానికి ఎన్నికలకు ముందు నుంచే అంటే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే గ్రేటర్ పరిధిలో రియల్ ఎస్టేట్ భారీగా పుంజుకుంది. ఎన్నికలు రావడంతో మళ్లీ రియల్ఎస్టేట్​పడిపోతుందని రియల్టర్లు భావించినా అలాంటిదేం జరగలేదని.. హెచ్ఎండీఏకు భారీగా అనుమతుల కోసం దరఖాస్తులు వస్తున్నాయని అధికారులు తెలిపారు. ఈ నేపథ్యంలో హెచ్ఎండీఏ పరిధిలోని గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీలకు కూడా టీజీ బీపాస్ విధానాన్ని అమలు చేయాలని నిర్ణయించినట్టు వెల్లడించారు. 

నెలాఖరు నుంచే అమలు 

హెచ్ఎండీఏ పరిధిలోని గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీల్లో ఈ నెలాఖరు నుంచే టీజీ బీపాస్ అమలుచేయాలని అధికారులు నిర్ణయించారు. హెచ్ఎండీఏ మొత్తం 7,224 చదరపు కిలోమీటర్ల పరిధిలో విస్తరించి ఉంది. ఇందులో 70 మండలాలు, 30 మున్సిపాలిటీలు, 1,930 గ్రామపంచాయతీలు, 7 కార్పొరేషన్లు ఉన్నాయి. అయితే కార్పొరేషన్​లు మినహా పంచాయతీలు, మున్సిపాలిటీల్లో 2016 నుంచి భవన నిర్మాణాలు, లేఅవుట్ల  పర్మిషన్లను ఇవ్వడానికి డీపీఎంఎస్ విధానాన్ని ప్రవేశ పెట్టారు. అయితే, హెచ్ఎండీఏ పరిధిలో రియల్ ఎస్టేట్ భారీగా పెరగడంతో ఆయా ప్రాంతాల్లో డీపీఎంఎస్ విధానం ద్వారా అనుమతులు ఇవ్వడం ఆలస్యం అవుతున్నట్టు అధికారులు గుర్తించారు. దీంతో పంచాయతీలు, మున్సిపాలిటీల్లోనూ టీజీ బీపాస్​అమలు చేయాలని నిర్ణయించారు.  

పుంజుకుంటున్న రియల్ ఎస్టేట్​

హెచ్ఎండీఏ పరిధిలో రియల్​ఎస్టేట్ జోరు పెరుగుతోందని అధికారులు చెప్తున్నారు. గత ఆరు నెలల నుంచి గ్రేటర్​పరిధిలో పెద్ద సంఖ్యలో భారీ నిర్మాణాలు, లేఅవుట్ల అనుమతుల కోసం దరఖాస్తులు వస్తున్నాయని వారు వెల్లడించారు. ఈ ఆరు నెలల కాలంలో మొత్తం 1,030 అనుమతులు ఇవ్వడం ద్వారా రూ. 336 కోట్ల ఆదాయాన్ని సమకూర్చుకున్నట్టు తెలిపారు. పార్లమెంట్ ఎన్నికలు ముగియడంతో ఇప్పుడు రియల్ ఎస్టేట్ మరింత పెరిగే అవకాశం ఉందని, అందుకే అన్ని చోట్లా టీజీ బీపాస్ ద్వారా వేగంగా అనుమతులు ఇవ్వడంతోపాటు భారీగా ఆదాయం సమకూర్చుకోవచ్చని భావిస్తున్నారు.