కేసీఆర్ దోచుకున్నడు : మేం పథకాలకు మళ్లించాం : సీఎం రేవంత్ రెడ్డి

  • ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు 2 గ్యారెంటీలను ప్రకటించిన రేవంత్ రెడ్డి
  • రూ. 500 కే సిలిండర్, 300 యూనిట్ల వరకు ఫ్రీ కరెంటు
  • కేజ్రీవాల్, మోదీ ఇద్దరూ ఒక్కటే
  • కాలుష్యాన్ని అదుపు చేయలే.. ఢిల్లీ రావాలంటే భయపడే పరిస్థితి 
  • 3 సార్లు గెలిచినా ఢిల్లీని అభివృద్ధి చేయలేదు
  • తెలంగాణలో 21 వేల కోట్ల రైతు రుణాలు మాఫీ చేశాం
  • ఏడాదిలో 55,140 సర్కారు ఉద్యోగాలు ఇచ్చినం
  • మీడియాతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

ఢిల్లీ: మాజీ సీఎం కేసీఆర్ రాష్ట్రాన్ని దోచుకున్నారని, ఆ డబ్బులనే తాము సంక్షేమ పథకాలకు మళ్లించి గ్యారెంటీలను అమలు చేస్తున్నామని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ తరఫున ఆయన రెండు గ్యారెంటీలను విడుదల చేశారు. ఢిల్లీలో అధికారంలోకి వస్తే రూ. 500కే సిలిండర్ అందిస్తామని, గృహావసరాలకు 300 యూనిట్ల వరకు ఉచిత కరెంటు అందిస్తామని రేవంత్ రెడ్డి చెప్పారు. తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 13 నెలల పూర్తయిందని, ఏడాదిలోపు 25 లక్షల 50 వేల రైతు కుటుంబాలకు 21 వేల కోట్ల రుణాలు మాఫీ చేశామని అన్నారు. 

బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఎక్కడా రుణమాఫీ చేయలేదని అన్నారు. రూ. 2 లక్షల వరకు రుణమాఫీ చేసి గ్యారెంటీని నిలబెట్టుకున్నామని చెప్పారు. అధికారంలోకి వచ్చిన తొలి ఏడాది లోనే  55,140 సర్కారు ఉద్యోగాలు ఇచ్చామని వివరించారు. మోదీ ప్రధాన మంత్రి అయ్యి 11 ఏండ్లవుతుందని, ఇప్పటి వరకు కేవలం ఏడు లక్షల ఉద్యోగాలే ఇచ్చారని అన్నారు. వాస్తవానికి ఆయన ఇవ్వాల్సినవి 22 కోట్ల కొలువులని అన్నారు. తెలంగాణలో మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం, 200 యూనిట్లలో పు గృహావసరాలకు ఫ్రీ కరెంటు ఇస్తున్నామని చెప్పారు. తెలంగాణలో తాము ఇచ్చిన ప్రతి హామీని అమలు చేస్తున్నామని అన్నారు. మూడు సార్లు కేజ్రీవాల్ సీఎం, మోదీ పీఎం అయినా ఢిల్లీ అభివృద్ధి చెందలేదని అన్నారు. కాలుష్యం కోరల్లో చిక్కుకున్న ఢిల్లీకి రావాలంటే ప్రజలు భయపడే పరిస్థితి ఉందని అన్నారు. షీలా దీక్షిత్ సీఎంగా ఉన్న సమయంలోనే హస్తిన అభివృద్ధి చెందిందని, దేశంలోనే అతి పెద్ద మెట్రో ను  నిర్మించినన ఘనత షీలాదీక్షిత్ నేతృత్వంలోని కాంగ్రెస్ పార్టీకే దక్కిందని చెప్పారు. సీఎన్జీ విధానాన్ని అముల చేసింది కూడా ఆమేనని అన్నారు. రోడ్లు, ఫ్లైఓవర్ల నిర్మాణం కూడా అప్పుడే జరిగిందని వివరించారు.  కాంగ్రెస్ అంటేనే గ్యారెంటీ అని, హామీలు ఇవ్వడమే కాదు అమలు చేసి చూపుతున్నామని వివరించారు. ఢిల్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని, హామీల అమల్లో ఏమైనా సమస్య ఉంటే తాను తెలంగాణ నుంచి వచ్చి ఇక్కడి ప్రభుత్వానికి అండగా ఉంటానని అన్నారు. 

లిక్కర్ పార్ట్ నర్  ను ఓడించాం:
కేజ్రీవాల్ సర్కారు అవినీతి కూపంగా మారిందని, ఢిల్లీ లిక్కర్ స్కామే ఇందుకు నిదర్శనమని అన్నారు. లిక్కర్ స్కాం పార్ట్ నర్ గా ఉన్న బీఆర్ఎస్ ను తెలంగాణలో ఓడించామని, అసలు సూత్రధారులను ఓడించేందుకు ఇక్కడికి వచ్చామని  సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. లిక్కర్  స్కాం కేసులో ఢిల్లీ సీఎం, ఉప ముఖ్యమంత్రి, మంత్రులు అంతా జైలు పాలయ్యారని చెప్పారు. ఇక్కడ అవినీతిని నియంత్రిస్తే గ్యారెంటీలు అమలు చేయడం పెద్ద సమస్యే కాదని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. 

కేంద్రంతో  పోరాడుతం:
దేశ రాజధానిగా ఉన్న ఢిల్లీ అభివృద్ధికి నిధుల కోసం కేంద్రంతో  పోరాడుతామని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. తమ పార్టీకి లోక్ సభలో వంద మంది ఎంపీల బలం ఉందని, కేంద్రాన్ని నిలదీస్తామని అన్నారు. పార్లమెంటులో బలమే లేని ఆప్ ను గెలిపిస్తే ప్రయోజనం ఉండదని సీఎం అన్నారు.

ALSO READ | అంతా ఆఫీసర్లకే తెలుసు: ఈడీ ప్రశ్నలకు కేటీఆర్ సమాధానం