జాబ్ పేరిట ఇద్దరు హైదరాబాదీ యువకులకు ట్రాప్

  • కంబోడియాలో వారితో  సైబర్ నేరాలు
  •  చేయకుంటే నిర్బంధించి చిత్రహింసలు
  •  ముంబైకి చెందిన ఓ ఏజెన్సీ యువతి అరెస్ట్

హైదరాబాద్‌‌‌‌, వెలుగు: విదేశాల్లో ఉద్యోగాల పేరుతో రాష్ట్రానికి చెందిన యువకులను కంబోడియా తరలిస్తున్న యువతిని టీజీ సైబర్ సెక్యూరిటీ బ్యూరో (టీజీసీఎస్‌‌‌‌బీ) గురువారం అరెస్ట్ చేసింది. శుక్రవారం ఆమెను కోర్టులో హాజరుపరిచి రిమాండ్‌‌‌‌కు తరలించింది. జాబ్ పేరిట నిరుద్యోగులను కంబోడియాకు తరలించి చిత్రహింసలు పెడుతున్నారని  సైబర్ సెక్యూరిటీ బ్యూరో డైరెక్టర్‌‌‌‌‌‌‌‌ శిఖాగోయల్‌‌‌‌ వెల్లడించారు. " ముంబైలోని చెంబూర్‌‌‌‌‌‌‌‌కు చెందిన ప్రియాంక శివ కుమార్‌‌‌‌ సిద్ధు( 30)మాక్స్‌‌‌‌వెల్ అనే ఫారిన్‌‌‌‌ జాబ్ ప్రాసెసింగ్ ఏజెన్సీలో పనిచేసింది. తనకున్న అనుభవంతో  సొంతంగా ఏజెన్సీ ప్రారంభించింది. ముంబైకి చెందిన నారాయణ, కంబోడియాలో  ఝాన్‌‌‌‌జీ అనే చైనా కంపెనీకి చెందిన జితేందర్ షాతో కలిసి ఇండియాలో నిరుద్యోగులను ట్రాప్ చేసేందుకు ప్లాన్ చేసింది. 

ఇందుకు గాను ఒక్కో క్యాండిడేట్ కు  500 డాలర్ల చొప్పున కమీషన్ మాట్లాడుకుంది. ఈ క్రమంలోనే ప్రియాంకను హైదరాబాద్‌‌‌‌కు చెందిన వంశీకృష్ణ, సాయిప్రసాద్‌‌‌‌ ఆన్‌‌‌‌లైన్‌‌‌‌లో సంప్రదించారు. ఒక్కక్కరి వద్ద రూ.30 వేల చొప్పున కమీషన్ తీసుకుని ఇద్దరినీ కంబోడియాకు పంపింది. అయితే, జితేందర్ షా ఆధ్వర్యంలో సైబర్‌‌‌‌‌‌‌‌ నేరాలు జరుగుతున్నట్లు వంశీకృష్ణ, సాయిప్రసాద్‌‌‌‌ గుర్తించారు. అక్కడి నుంచి పారిపోయి ఇండియాకు వచ్చేందుకు యత్నించారు. కానీ ఇద్దరినీ సైబర్‌‌‌‌‌‌‌‌ నేరగాళ్లు అక్కడే నిర్భందించారు. శారీరక, మానసికంగా తీవ్రంగా హింసించారు. ఈ ఇద్దరు అక్కడి పోలీసుల సహకారంతో ఇండియాకు తిరిగి వచ్చారు. బాధితులిచ్చిన సమాచారం ఆధారంగా సైబర్ సెక్యూరిటీ బ్యూరో అధికారులు ప్రియాంకను అరెస్ట్ చేసి హైదరాబాద్ తరలించాం" అని శిఖాగోయల్‌‌‌‌  పేర్కొన్నారు.