హైదరాబాద్, వెలుగు: సైబర్ నేరాల్లో దొరికిన వారిలో ఉన్నత విద్యావంతులే ఎక్కువగా ఉన్నారని టీజీ సైబర్ సెక్యూరిటీ బ్యూరో (సీఎస్ బీ) డైరెక్టర్ శిఖా గోయల్ తెలిపారు. గత ఆరు నెలల వ్యవధిలో 76 కేసుల్లో వాంటెడ్‌గా ఉన్న165 మంది సైబర్ నేరగాళ్లను అరెస్టు చేశామని ఆదివారం ఒక ప్రకటనలో ఆమె వెల్లడించారు. నిందితులకు రాష్ట్రవ్యాప్తంగా 795, దేశవ్యాప్తంగా 3,357 సైబర్ నేరాలతో సంబంధం ఉన్నట్టు గుర్తించామని చెప్పారు. ‘‘నేరాల నియంత్రణకు సాంకేతిక ఆధారాలతో కేసులు దర్యాప్తు చేస్తున్నాం.
ఈ ఏడాది ఏప్రిల్‌లో మొత్తం ఏడు సైబర్ క్రైం పోలీస్ స్టేషన్లను (సీసీపీఎస్) ఏర్పాటు చేశాం. ఢిల్లీ, గుజరాత్, ఒడిశా, అస్సాం, రాజస్థాన్, తమిళనాడు, ఏపీ, హర్యానా, జార్ఖండ్, కర్నాటక, మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్ లో సెర్చ్ ఆపరేషన్ చేశాం. నేరస్థులను అరెస్టు చేసేందుకు వెళ్లిన సమయంలో పోలీసులపై స్థానికులు దాడులకు పాల్పడ్డారు” అని శిఖా గోయల్ వివరించారు. సైబర్ కేసుల్లో పార్ట్‌టైం జాబ్స్, స్టాక్ ట్రేడింగ్ మోసాలు ఎక్కువ ఉన్నాయని తెలిపారు. 45 శాతం మంది నేరస్థులు గ్రాడ్యుయేట్లు, బీటెక్, ఎంబీఏ, ఎంసీఏ, పోస్ట్ గ్రాడ్యుయేట్లు ఉన్నారని చెప్పారు. 49 శాతం మంది 21 నుంచి 30 ఏళ్ల మధ్య వయస్సు ఉన్నవారని పేర్కొన్నారు.