మ్యూల్ అకౌంట్స్ గ్యాంగ్‌‌ అరెస్టు .. 10 మంది ఏజెంట్లు అదుపులోకి

మ్యూల్ అకౌంట్స్ గ్యాంగ్‌‌ అరెస్టు .. 10 మంది ఏజెంట్లు అదుపులోకి
  • 38 మంది ఖాతాదారులు

హైదరాబాద్‌‌, వెలుగు: సైబర్  నేరగాళ్లు వినియోగిస్తున్న మ్యూల్ అకౌంట్స్‌‌పై టీజీ సైబర్  సెక్యూరిటీ బ్యూరో (సీఎస్‌‌బీ) స్పెషల్  ఫోకస్ పెట్టింది. వారం రోజుల పాటు రాష్ట్రవ్యాప్తంగా సోదాలు నిర్వహించి మ్యూల్‌‌ అకౌంట్స్‌‌  గ్యాంగ్​ను సీఎస్ బీ పోలీసులు అరెస్టు చేశారు. ఆ గ్యాంగ్  సప్లై చేసిన 10 మంది ఏజెంట్లు, 38 మంది ఖాతాదారులను అదుపులోకి తీసుకున్నారు. నిందితుల వద్ద 53 సెల్‌‌ఫోన్స్‌‌, 18 పాస్‌‌బుక్స్‌‌, 10 ఏటీఎం కార్డులు, ల్యాప్‌‌టాప్స్, కంప్యూటర్లను సీజ్‌‌ చేశారు. ఈ వివరాలను సీఎస్ బీ డైరెక్టర్‌‌‌‌  శిఖా గోయల్‌‌ బుధవారం మీడియాకు వెల్లడించారు.

ఏజెంట్ల నెట్‌‌వర్క్‌‌  వద్ద సైబర్‌‌  ‌‌నేరగాళ్లు మ్యూల్‌‌ అకౌంట్లను కొనుగోలు చేస్తున్నారు. క్యాబ్, ఆటోడ్రైవర్లు,  కూలీలు, నిరుద్యోగ యువతకు కమీషన్ల ఆశచూపి ఫోర్జరీ డాక్యుమెంట్లలో వేరే వాళ్లఫోన్​ నంబర్లతో ఖాతాలు ఓపెన్  చేయించి, డబ్బులు కొట్టేసేవారు. హైదరాబాద్‌‌, ఖమ్మం, నిజామాబాద్, కరీంనగర్‌‌‌‌, సంగారెడ్డి, పెద్దపల్లి సహా రాష్ట్రవ్యాప్తంగా 38 మ్యూల్  అకౌంట్లను సైబర్  నేరగాళ్లు ఆపరేట్‌‌  చేస్తున్నారని అధికారులు తెలిపారు. ఖాతాదారులను అదుపులోకి తీసుకుని విచారించామని చెప్పారు. వారు ఇచ్చిన సమాచారంతో 10 మంది ఏజెంట్లను అరెస్ట్  చేశామని వెల్లడించారు.