
- మే 2 నుంచి ఇంజినీరింగ్ స్ట్రీమ్కు పరీక్షలు
- 3,06,796 మంది దరఖాస్తులు
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో ఇంజినీరింగ్, ఫార్మసీ, అగ్రికల్చర్ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే టీజీ ఎప్ సెట్ పరీక్షలు మంగళవారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ పరీక్షలకు సంబంధించి అన్ని ఏర్పాట్లను అధికారులు పూర్తి చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా టీజీ ఈఏపీసెట్ కు 3,06,796 దరఖాస్తులు వచ్చాయి.
ఇంజినీరింగ్ స్ట్రీమ్లో 2,20,049, అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ స్ట్రీమ్లో 86,493, రెండింటికీ 254 అప్లికేషన్లు వచ్చాయి. ఈ నెల 29, 30వ తేదీల్లో జరిగే అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ ఎగ్జామ్ కోసం 112 సెంటర్లు ఏర్పాటు చేశారు. మే 2 నుంచి 4 వరకు జరిగే ఇంజినీరింగ్ స్ట్రీమ్ కోసం 124 సెంటర్లు ఏర్పాటు చేశారు. ఎప్ సెట్ ఎగ్జామ్స్ ప్రతిరోజూ 2 సెషన్లలో నిర్వహించనున్నారు.
మార్నింగ్ సెషన్ ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, మధ్యాహ్నం సెషన్ 3 నుంచి సాయంత్రం 6 గంటల వరకు కొనసాగనున్నాయి. అయితే, ఆన్లైన్లో జరిగే ఈ పరీక్షలకు ఎప్ సెట్ అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఇప్పటికే దాదాపు అభ్యర్థులంతా వెబ్ సైట్నుంచి హాల్ టికెట్లను డౌన్ లోడ్ చేసుకున్నారు. తొలిసారిగా ఎప్ సెట్ హాల్ టికెట్లపై క్యూఆర్ కోడ్ ను ముద్రించారు. దాని ద్వారా ఎగ్జామ్ సెంటర్ రూట్ మ్యాప్ ఈజీగా తెలుసుకునే అవకాశం లభించింది.
అమల్లో నిమిషం నిబంధన
ఎగ్జామ్కు నిమిషం నిబంధన అమలు చేయనున్నారు. మార్నింగ్ సెషన్ ఎగ్జామ్కు ఉదయం 7.30 గంటలకు, మధ్యాహ్నం సెషన్ వారికి 1.30 గంటల నుంచి కేంద్రాల్లోకి అనుమతిస్తారు. బయోమెట్రిక్ తప్పనిసరి ఉండడంతో అభ్యర్థుల వేలిముద్రలను తీసుకుంటారు. చేతులపై మెహందీ, టాటూ, ఇంక్ మొదలైన డిజైన్లు ఉండకూడదు. ఫొటో ఐడీ, హాల్‌టికెట్, బ్లాక్/బ్లూ బాల్‌పాయింట్ పెన్ను తీసుకెళ్లాలి.