- ఏపీకి రూ.7,211 కోట్లు
- యూపీకి అత్యధికంగా రూ. 31, 962 కోట్లు
- 28 రాష్ట్రాలకు అక్టోబర్ నెల ఇన్ స్టాల్ మెంట్లు రూ.1.78 లక్షల కోట్లు రిలీజ్
న్యూఢిల్లీ, వెలుగు: కేంద్ర పన్నుల్లో వాటా కింద తెలంగాణకు రూ. 3, 745 కోట్లు విడుదలయ్యాయి. పక్కరాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ కు రూ.7,211 కోట్లను కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది. అక్టోబర్ నెలకు రాష్ట్రాలకు రావాల్సిన పన్నుల వాటాను కేంద్ర ఆర్థిక శాఖ గురువారం రిలీజ్ చేసింది. ఇందులో భాగంగా దేశంలోని 28 రాష్ట్రాలు/యూటీలకు రూ.1,78,173 కోట్లను విడుదల చేశామని ఆర్థిక శాఖ వెల్లడించింది. అక్టోబర్ నెల పన్నుల వాటా కింద రాష్ట్రాలకు రూ.89,087 కోట్లు విడుదల చేశామని పేర్కొంది. కాగా... పన్నుల వాటాలో ఉత్తరప్రదేశ్ కు అత్యధికంగా రూ. 31,962 కోట్లు దక్కాయి.
తర్వాతి స్థానంలో బిహార్ రూ.17,921కోట్లు, మధ్యప్రదేశ్ కు రూ. 13,987 కోట్లు, బెంగాల్ కు రూ. 13,404 కోట్లను కేంద్రం విడుదల చేసింది. అత్యల్పంగా గోవాకు రూ.688 కోట్లు రిలీజ్ చేసింది. నిబంధనల ప్రకారం.. ఒక ఆర్థిక సంవత్సరంలో 14 వాయిదాల్లో కేంద్ర పన్నుల వాటాను రాష్ట్రాలకు పంపిణీ చేయవచ్చని తెలిపింది. ఇందుకు భిన్నంగా 11 నెలల్లో పదకొండు వాయిదాలతో పాటు మార్చిలో మూడుసార్లు పన్నుల వాటాను విడుదల చేశామని వివరించింది. పండగల సీజన్ లో అభివృద్ధి, సంక్షేమం సంబంధిత వ్యయాలకు ఆర్థిక సాయం చేసే ఉద్దేశంతోనే తాజాగా అడ్వాన్స్ ఇన్ స్టాల్ మెంట్ ను పంపిణీ చేశామని స్పష్టం చేసింది.
పన్ను వాటాను 50 శాతానికి పెంచాలి...
కేంద్ర పన్నుల్లో రాష్ట్రాల వాటాను 50 శాతానికి పెంచాలని తెలంగాణతో పాటు పలు రాష్ట్రాలు డిమాండ్ చేస్తున్నాయి. ఇటీవల తెలంగాణకు వచ్చిన 16వ ఫైనాన్స్ కమిషన్ కు ఈ సమస్యలను రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం వివరించింది. కేంద్ర పన్నుల వాటాను 50 శాతానికి పెంచాలని ప్రతిపాదించింది. అలాగే జీఎస్టీ కౌన్సిల్ మీటింగ్ లోనూ ఉప ముఖ్యమంత్రి ఇదే విషయాన్ని నొక్కి చెప్పారు. వాస్తవానికి 15వ ఆర్థిక సంఘం సిఫారసుల ప్రకారం... కేంద్ర పన్నుల్లో 41 శాతాన్ని రాష్ట్రాలకు ఇవ్వాల్సి ఉంటుంది.
ఇందుకు భిన్నంగా 2024 ఆర్థిక సంవత్సరంలో 32.5 శాతం కేంద్ర పన్నులను రాష్ట్రాలతో పంచుకోవాలని ఆర్థిక శాఖ అంచనా వేసింది. దీనివల్ల సెస్, సర్ చార్జీల్లో కూడా కేంద్రం నుంచి వాటా భారీగా తగ్గుతుందని రాష్ట్రాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.