- పార్టీ ఫిరాయింపుల కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను తప్పుపట్టిన ప్రభుత్వం
హైదరాబాద్, వెలుగు: బీఆర్‌ఎస్ నుంచి ఎన్నికై కాంగ్రెస్‌లోకి ఫిరాయించిన ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై నిర్ణయం తీసుకోవడానికి స్పీకర్ కు సమయం ఇవ్వకుండా హైకోర్టులో పిటిషన్‌లు దాఖలు చేశారని హైకోర్టుకు రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. గతంలో సింగిల్ జడ్జి ఇచ్చిన ఉత్తర్వులను రద్దు చేయాలని కోరింది.అసెంబ్లీ కార్యదర్శి వి.నరసింహాచార్యులు చేసిన అప్పీళ్లను హైకోర్టు మంగళవారం విచారించింది.
ఏజీ సుదర్శన్ రెడ్డి వాదిస్తూ.. ‘‘గతంలోసుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును పరిగణనలోకి తీసుకుని మాత్రమే సింగిల్ జడ్జి ఉత్తర్వులు జారీ చేశారు.బీఆర్ఎస్ నేతలు స్పీకర్‌కు గడువు కూడా ఇవ్వకుండా పిటిషన్లు వేశారు” అని తప్పుపట్టారు. స్పీకర్ నిర్ణయాల్లో జోక్యం చేసుకోరాదంటూ గతంలో ఇదే హైకోర్టు తేల్చి చెప్పిందని ఏజీ గుర్తు చేశారు. స్పీకర్ అధికారాల్లో కోర్టుల జోక్యంపై పలు సందర్భాల్లో సుప్రీంకోర్టు వెలువరించిన తీర్పులను ప్రస్తావించారు. ఈ తీర్పులను సింగిల్ జడ్జి పట్టించుకోలేదన్నారు. దానం తరఫు లాయర్ రవిశంకర్ వాదిస్తూ.. స్పీకర్ విధుల్లో కోర్టులు జోక్యం చేసుకోరాదన్నారు. స్పీకర్ నిర్ణయం వెలువరించాకే న్యాయ సమీక్షకు అవకాశం ఉంటుందన్నారు. ఈ కేసులో వాదనలు బుధవారం కూడా కొనసాగనున్నాయి.