
- దరఖాస్తులకు వెబ్సైట్ ఓపెన్..వివరాల ఎడిట్‌కు ఆప్షన్
- కొత్త పాస్ బుక్‌లు వచ్చిన వాళ్లు అప్లై చేసుకోవాలని వ్యవసాయ శాఖ సూచన
- జనవరి 26 నుంచి స్కీము అమల్లోకి
హైదరాబాద్, వెలుగు: ఈ నెల 26 నుంచి రైతు భరోసా అమలుకు సిద్ధమైన సర్కారు, ఇదివరకే ఉన్న లబ్ధిదారులతో పాటు కొత్తవారికి కూడా ఇవ్వాలని నిర్ణయించింది. జనవరి 1 వరకు కొత్తగా పట్టాదార్` పాస్‌బుక్ కలిగిన రైతులకు సైతం పెట్టుబడి సాయం అందించనున్నారు. అలాగే పోడు భూములకు సైతం రైతుభరోసా ఇవ్వనున్నారు. ఇందుకోసం గిరిజనాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో జారీ చేసిన ఆర్ఓఎఫ్ఆర్ పట్టాలను పరిగణనలోకి తీసుకుంటారు. ఈ సారి సాగు చేస్తున్న భూములకే రైతుభరోసా ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఈ మేరకు క్షేత్రస్థాయిలో అధికారులు ఫీల్డ్ సర్వే చేసి సాగుకు యోగ్యంకాని భూములు దాదాపు 10 లక్షల ఎకరాల వరకు ఉన్నట్లు లెక్క తేల్చారు. రాళ్లురప్పలు, గుట్టలు, వెంచర్ భూములను గ్రామసభల్లోనే రైతుల సమక్షంలో తొలగిస్తున్నారు.
రైతుభరోసా సైట్ ఓపెన్
రైతు భరోసా అమలుకు సర్కారు క్షేత్రస్థాయిలో అన్ని ఏర్పాట్లు చేస్తున్నది. ఇందులో భాగంగా తాజాగా రైతు భరోసా సైట్‌ను ఓపెన్ చేసి ఏఈవోలకు అందుబాటులోకి తెచ్చింది. రైతుల బ్యాంకు అకౌంట్లు, ఆధార్‌నంబర్ల మార్పులు చేర్పులకు వీలుగా ఎడిట్ ఆప్షన్ కల్పించారు. గతంలో ఇచ్చిన వివరాల్లో ఏమైనా తప్పులుంటే, బ్యాంకు అకౌంట్ల వివరాలు మార్చుకోవాలన్నా, ఏఈవోలను సంప్రదించి చేసుకోవచ్చు. ఈ సారి ఫోన్‌నంబర్ కూడా మార్చుకునే అవకాశం కల్పిస్తున్నారు. క్షేత్రస్థాయిలో రైతులు ఇచ్చిన వివరాలను అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ అధికారులు (ఏఈవో)లు అప్డేట్ చేస్తారు.
ఎకరాకు రూ.6 వేల చొప్పున
రైతు భరోసా పథకాన్ని ఈ నెల 26 నుంచి రాష్ట్ర సర్కారు అమలు చేయడానికి సన్నాహాలు చేస్తున్నది. ఈ సీజన్లో ఎకరానికి రూ.6 వేల చొప్పున అందించేందుకు సమాయత్తమైంది. రైతు భరోసాకు సాగు యోగ్యమైన భూములకు మాత్రమే ఇచ్చేందుకు నిర్ణయించిన నేపథ్యంలో మార్క్ బేస్ సర్వే నంబర్ ఆధారంగా పక్కాగా లెక్కలు తీస్తున్నారు. సర్వే పూర్తి కాగానే ఆ గ్రామాలను ఫ్రీజ్ విలేజ్‌గా చేసి గ్రామ సభల ద్వారా ఆమోదం పొందిన సాగు యోగ్యత లేని భూములను శనివారం అప్లోడ్ చేయనున్నారు. ఈ వివరాల ఆధారంగా సోమవారం నుంచి రైతుభరోసా విడుదల చేయనున్నారు. గతంలో రైతుబంధు అమలు చేసిన తరహాలోనే ఎకరాల వారీగా అందించేందుకు వ్యవసాయశాఖ ఏర్పాట్లు పూర్తి చేసింది. ఆర్థిక శాఖ విడుదల చేసే నిధుల ఆధారంగా రైతుల బ్యాంకు అకౌంట్లకు నేరుగా నిధులు బదిలీ చేయనున్నారు.
ALSO READ : తెగని సీఎంఆర్ పంచాయితీ
ప్రత్యేక ఆప్షన్
రైతు భరోసా సైట్లో కొత్తపట్టాదారులకు సంబంధించిన ప్రత్యేక ఆప్షన్ ఇచ్చారు. జనవరి 1 తేదీ వరకు భూమి రిజిస్ట్రేషన్ అయి కొత్తగా పాస్‌బుక్ వచ్చిన రైతులు తమ పాస్‌బుక్, ఆధార్, బ్యాంక్ అకౌంట్ వివరాలు ఏఈవోలకు ఇస్తే వాటిని అప్లోడ్ చేసేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తిచేశారు. గతంలో పెట్టుబడి సాయానికి అర్హత ఉన్నప్పటికీ వివరాలు ఇవ్వకపోవడం వల్ల రైతుబంధు రానివారు కూడా ఇప్పుడు రైతు భరోసా కోసం అప్లై చేసుకునే అవకాశం కల్పించారు. కాగా, ఈ అప్డేషన్ ఎప్పటి వరకు ఇస్తారనేది మాత్రం ఇప్పటి వరకు ప్రకటించలేదు.