టార్గెట్ 40 వేల కోట్లు.. నిధుల సర్దుబాటుకు ప్రభుత్వం కసరత్తు

టార్గెట్ 40 వేల కోట్లు.. నిధుల సర్దుబాటుకు ప్రభుత్వం కసరత్తు
  • రుణమాఫీ, రైతు భరోసా నిధుల సర్దుబాటుకు ప్రభుత్వం కసరత్తు
  • రుణమాఫీ కోసం కార్పొరేషన్ ఏర్పాటు చేసి అప్పు తీసుకోవాలని యోచన
  • ఎల్ఆర్ఎస్, జీవో 59 దరఖాస్తుల పరిష్కారంపైనా ఫోకస్
  • జీవో 59 అప్లికేషన్లతో రూ.2 వేల కోట్లు, ఎల్ఆర్ఎస్​తో రూ.10 వేల కోట్లు వస్తాయని అంచనా 

హైదరాబాద్, వెలుగు : గ్యారంటీల అమలుకు నిధుల సర్దుబాటుపై ప్రభుత్వం కసరత్తు చేస్తున్నది. పంద్రాగస్టులోపు రుణమాఫీ చేయాల్సి ఉండడం, మరో రెండు నెలల్లో రైతు భరోసా కూడా పంపిణీ చేయాల్సి ఉండడంతో.. వీటికి అవసరమైన నిధులను సమకూర్చుకునేందుకు ఆదాయ మార్గాలను అన్వేషిస్తున్నది. ఈ రెండింటితో పాటు మరికొన్ని ముఖ్యమైన గ్యారంటీలకు అవసరమైన నిధులు సర్దుబాటు చేయాలని, అందుకోసం మొత్తం రూ.40 వేల కోట్లు సేకరించాలని టార్గెట్ పెట్టుకున్నది. రుణమాఫీ కోసం ప్రత్యేక కార్పొరేషన్​ ఏర్పాటు చేసి అప్పు తీసుకోవాలని భావిస్తున్నట్టు సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికే ప్రకటించారు. ఈ అప్పు కూడా ఎఫ్ఆర్​బీఎం పరిధిలోనే తీసుకోనున్నారు. దీంతో పాటు ఇతర ఆదాయ మార్గాలపైనా ప్రభుత్వం దృష్టి పెట్టింది. ఏ విధంగా తొందరగా నిధులు సర్దుబాటు చేసుకోవచ్చనే దానిపై రిపోర్ట్​ రెడీ చేయాలని అధికారులను సీఎం ఆదేశించినట్టు తెలిసింది. 

కోర్టులో పెండింగ్​లో ఉన్న ఎల్ఆర్ఎస్ ఇష్యూను త్వరగా పరిష్కరించుకుని ముందుకెళ్లాలని, అలాగే జీవో 59 కింద వచ్చిన రెగ్యులరైజేషన్ అప్లికేషన్లను క్లియర్ చేయాలని ప్రభుత్వం భావిస్తున్నది. తద్వారా రెండు, మూడు నెలల్లో వీలైనంత ఎక్కువ మొత్తంలో ఆదాయం సమకూర్చుకోవాలని చూస్తున్నది.   

ఎఫ్ఆర్ బీఎం పరిధిలోనే అప్పు.. 

రుణమాఫీ కోసం కొత్త కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని సీఎం రేవంత్​రెడ్డి భావిస్తున్నారు. దాని ద్వారా వివిధ ఆర్థిక సంస్థలు లేదంటే ఆర్బీఐ నుంచి అప్పు తీసుకోవాలని అనుకుంటున్నారు. కార్పొరేషన్ ద్వారా ఎక్కువ మొత్తంలో అప్పు తీసుకోవచ్చునని, ఫలితంగా ఒకేసారి రైతులందరికీ రూ.2 లక్షల రుణమాఫీ చేసే అవకాశం ఉంటుందని యోచిస్తున్నారు. ఈ నేపథ్యంలో రుణమాఫీకి నిధులెన్ని అవసరమవుతాయనే దానిపై అధికారులు లెక్కలు తీస్తున్నారు. కార్పొరేషన్​ఏర్పాటు చేసి ప్రభుత్వ గ్యారంటీ కింద ఒకేసారి రూ.15 వేల కోట్ల నుంచి రూ.20 వేల కోట్ల మేర అప్పు తీసుకోవాలని సర్కార్ చూస్తున్నది. ఎక్కడ తక్కువ వడ్డీకి అప్పు దొరికితే అక్కడే తీసుకోవాలని భావిస్తున్నది. ఈ మొత్తం కూడా ఎఫ్ఆర్​బీఎం లిమిట్ లోనే తీసుకోవాలని అనుకుంటున్నది. ప్రస్తుతం ఒకేసారి ఎక్కువగా అప్పు తీసుకుని, ఆ తర్వాత ఎఫ్ఆర్ బీఎం లిమిట్ లో ఏటా కొంచెం తగ్గించుకుంటామని కేంద్రాన్ని, ఆర్బీఐని రాష్ట్ర ప్రభుత్వం కోరనుంది. ప్రభుత్వ గ్యారంటీతో కార్పొరేషన్ల ద్వారా తీసుకున్న అప్పులకు వాటి సొంత ఆదాయం చూపకుంటే ఎఫ్ఆర్బీఎం లిమిట్ లోనే పరిగణిస్తామని గతంలో కేంద్రం ప్రకటించింది. 2021–22లో, అంతకుముందు గ్యారంటీలతో చేసిన అప్పులకు ఆ తర్వాత ఆర్థిక సంవత్సరాల్లో రాష్ట్ర బడ్జెట్​అప్పులలో కొంత కొంత చొప్పున కోత పెడుతూ అప్పటి సర్కార్ సర్దుబాటు చేసింది. దీంతో అప్పుడు  అవకాశం ఇచ్చినట్టుగానే ఈసారి ఇవ్వాలని కేంద్రాన్ని రాష్ట్ర ప్రభుత్వం కోరనున్నట్టు తెలిసింది. 

ఆదాయ మార్గాలపై అన్వేషణ.. 

వచ్చే వానాకాలం నుంచి రైతు భరోసా అమలు చేస్తామని ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది. దానికి దాదాపు రూ.8 వేల కోట్లు అవసరమవుతాయని అంచనా వేస్తున్నది. దీంతో పాటు ఇతర గ్యారంటీలను పూర్తి స్థాయిలో అమలు చేయాలంటే మరికొన్ని నిధులు అవసరం కానున్నాయి. హౌసింగ్ బోర్డ్ ఆధ్వర్యంలో చేపట్టిన 12 జాయింట్ వెంచర్స్ ప్రాజెక్టులో ఆరు ప్రాజెక్టులు పూర్తి కాగా, ప్రభుత్వానికి  రూ.525 కోట్ల బకాయిలు రావాల్సి ఉన్నది. వీటిని వసూలు చేయడంపై సర్కార్ దృష్టి సారించింది. అలాగే ఎల్‌ఆర్‌ఎస్‌, బీఆర్‌ఎస్‌ కింద 25.59 లక్షల దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి. 

ఇక జీవో 58, 59 కింద 3.96 లక్షల అప్లికేషన్లు తీసుకున్నారు. జీవో 58 కింద దరఖాస్తుల క్రమబద్ధీకరణ ఉచితమే. కానీ జీవో 59 అప్లికేషన్ల పరిష్కరం ద్వారా దాదాపు రూ.2 వేల కోట్లకు పైగా ఆదాయం వస్తుందని అంచనా వేస్తున్నారు. వీటిలో కొన్ని గత సర్కార్​ పరిష్కరించగా, ఎన్నికల కోడ్ రావడంతో ఇంకా కొన్ని పెండింగ్​లో పెట్టారు.  ఇక ఎల్ఆర్ఎస్​, బీఆర్​ఎస్​పై సుప్రీంకోర్టులో కేసులు ఉన్నాయి. వీటి పరిష్కారానికి ఏం చేయాలో ఆలోచించాలని అధికారులను సర్కార్ ఆదేశించింది. ఎల్‌ఆర్‌ఎస్‌ కింద పాత, కొత్త దరఖాస్తుల పరిష్కారం ద్వారా రూ.10 వేల కోట్లు రావొచ్చని అంచనా వేస్తున్నారు. గత ప్రభుత్వ హయంలో పెద్ద ఎత్తున భూముల అమ్మకాలు చేపట్టగా, వాటికి సంబంధించిన బకాయిలు పెండింగ్ లో ఉన్నాయని, వాటిని త్వరగా వసూలు చేయాలని ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది.