ఇక మై- పంచాయతీ!.. మై– జీహెచ్ఎంసీ తరహాలో ప్రత్యేక యాప్

ఇక మై- పంచాయతీ!.. మై– జీహెచ్ఎంసీ  తరహాలో ప్రత్యేక యాప్

 

  • బర్త్, డెత్, సర్టిఫికెట్లు సహా 20 రకాల సేవలు అందుబాటులోకి
  • పంచాయతీ రాజ్ శాఖ కసరత్తు

హైదరాబాద్, వెలుగు: ప్రజల సమస్యలను వేగంగా పరిష్కరించడంతో పాటు పారదర్శకంగా సేవలు అందించేందుకు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల డైరెక్టర్  సృజన వినూత్న ఆలోచనకు శ్రీకారం చుట్టారు. ప్రజలు పంచాయతీ కార్యాలయాలు, మీ సేవ కేంద్రాలు, ఆన్ లైన్  సెంటర్ల చుట్టూ తిరగకుండా ఆన్ లైన్​లో అప్లై చేసుకునేలా ప్రత్యేక యాప్​ను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు కసరత్తు చేస్తున్నారు. స్మార్ట్ ఫోన్  ఉంటే చాలు ఎక్కడి నుంచైనా తమ పంచాయతీలో వివిధ సర్టిఫికెట్ల కోసం దరఖాస్తు చేసుకునేలా ప్రత్యేక యాప్​ను రూపొందిస్తున్నారు. 

పంచాయతీ స్థాయిలో బర్త్, డెత్  సర్టిఫికెట్ల జారీ, హౌజ్  పర్మిషన్, కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్​ అప్లికేషన్లు, ఆస్తిపన్ను, ట్రేడ్  లైసెన్స్, లే ఔట్ పర్మిషన్  వంటి 20 రకాల సేవలు ఆన్ లైన్ లో అందించేలా యాప్ ను తయారు చేస్తున్నారు.  అంతేకాదు, గ్రామ పంచాయతీలో సమస్యలను  సైతం ఆన్ లైన్ లో ఫిర్యాదు చేసేలా యాప్ ను అభివృద్ధి చేస్తున్నారు. సమస్య ఏదైనా ఈ యాప్  ద్వారా నేరుగా అధికారుల దృష్టికి తీసుకెళ్లవచ్చు. ఇప్పటి వరకూ పలు సమస్యల పరిష్కారం కోసం పంచాయతీ కార్యాలయానికి వెళ్లి దరఖాస్తు చేసుకున్నారు. బర్త్, డెత్, హౌజ్ పర్మిషన్ ఏదైనా కావాలంటే పంచాయతీకి వెళ్లి కార్యదర్శికి అప్లికేషన్  పెట్టుకుంటున్నారు. పలుమార్లు కార్యాలయాల చుట్టూ తిరిగినా పనికావట్లేదు. 

కార్యదర్శి అందుబాటులో ఉండకపోవడం, ఫోన్లు ఎత్తకుండా సతయించడం ఇలా అనేక ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఉపాధి కోసం గ్రామాన్ని విడిచి ఇతర పట్టణాలు, నగరాలకు వెళ్లినవారు వివిధ సర్టిఫికెట్ల కోసం అప్లికేషన్  పెట్టుకోవాలంటే పంచాయతీ కార్యాలయాలకు రావాల్సి వస్తున్నది. దీంతో ఆర్థిక భారంతోపాటు సమయం వృథా అవుతోంది. దీనివల్ల నేటికీ కొందరు బర్త్, డెత్  సర్టిఫికెట్లు తీసుకోవడం లేదు. ఈ నేపథ్యంలో ‘మై పంచాయతీ’ యాప్ అందుబాటులోకి వస్తే ఆర్థిక భారం తప్పడంతోపాటు టైం ఆదా అవుతుంది. త్వరగా సేవలు పొందే వీలుంటుంది. దళారుల ప్రమేయం తొలగిపోతుంది. అక్రమాలకూ చెక్ పెట్టవచ్చని పంచాయతీ రాజ్​ శాఖ భావిస్తోంది