సర్కారు బడులు లేనిచోట ప్రైవేటులో 25 శాతం ఉచిత సీట్లు!

 

  • ‘కర్నాటక’ విధానం అమలుకు యోచన 
  • సర్కారుకు స్కూల్ ఎడ్యుకేషన్ లేఖ.. త్వరలోనే నిర్ణయం

హైదరాబాద్, వెలుగు: విద్యాహక్కు చట్టం ప్రకారం ప్రైవేటు బడుల్లో 25 శాతం పేదలకు ఉచిత సీట్లు ఇవ్వాలనే నిబంధన అమలుపై సర్కారు యోచిస్తున్నది. కర్నాటక రాష్ట్రంలో అమలు చేస్తున్న విధానాన్ని తెలంగాణలోనూ అమలు చేసే ఆలోచనలో ఉన్నది. దీని ప్రకారం సర్కారు, ఎయిడెడ్ స్కూళ్లు లేని చోటనే ప్రైవేటు బడుల్లో 25శాతం ఉచిత సీట్లు ఇవ్వాలని భావిస్తున్నది. దీనిపై హైకోర్టులోనూ కేసు నడుస్తున్నది. కాగా, ఇదే అంశంపై గతనెలలో అప్పటి స్కూల్ ఎడ్యుకేషన్ కమిషన్ శ్రీదేవసేన.. విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశంకు లేఖ రాశారు. విద్యాహక్కు చట్టంలోని సెక్షన్12(1) సీ ప్రకారం ప్రీప్రైమరీ, ఒకటో తరగతిలో 25శాతం సీట్లు ఇవ్వాల్సి ఉంటుంది. అయితే, ఇది అమలు చేస్తే సర్కారు బడుల్లో పిల్లల సంఖ్య తగ్గుతుందని అధికారులు చెప్తున్నారు. ఇప్పటికే సర్కారు బడుల్లో లక్షలాది ట్రైన్డ్ టీచర్లు ఉండగా,  త్వరలో మరో 11వేల టీచర్ పోస్టులను భర్తీ చేయనున్నట్టు పేర్కొంటున్నారు. బడ్జెట్ కూడా విద్యారంగానికి ప్రతిఏటా పెంచుతున్నట్టు లేఖలో వివరించారు. ఒక కిలోమీటర్ లోపు ప్రైమరీ, మూడు కిలోమీటర్లలోపు అప్పర్ ప్రైమరీ సర్కారీ స్కూల్ లేకపోతేనే, ప్రైవేటు స్కూళ్లలో 25శాతం ఉచిత సీట్ల విధానం కర్నాటకలో అమలు చేస్తున్నారు. తెలంగాణలోనూ కర్నాటక తరహా విధానాన్ని అమలు చేయాలని అధికారులు భావిస్తున్నారు.