గుడ్ న్యూస్: గౌడన్నలకు కాటమయ్య సేఫ్టీ కిట్స్

  • ‘కాటమయ్య రక్షణ కవచం’ పేరుతో మోకుల పంపిణీకి సర్కార్ చర్యలు
  • చెట్టు పైనుంచి జారినా కిందపడకుండా ఉండేలా తయారీ
  • నేడు ఇబ్రహీంపట్నంలోని లష్కర్ గూడలో ప్రారంభించనున్న సీఎం

కరీంనగర్, వెలుగు: గీత కార్మికులు తాటిచెట్టు ఎక్కుతూ పట్టుతప్పినా కింద పడకుండ ఉండేందుకు ప్రత్యేకంగా రూపొందించిన సేఫ్టీ మోకులను పంపిణీ చేసేందుకు రాష్ట్ర సర్కార్ సిద్ధమైంది. గౌడల కులదైవమైన కాటమయ్య పేరిట‘కాటమయ్య రక్షణ కవచం’గా ఈ సేఫ్టీ మోకుకు పేరుపెట్టారు. ఆదివారం ఇబ్రహీంపట్నం నియోజకవర్గం అబ్దుల్లాపూర్ మెట్ మండలం లష్కర్ గూడలో సీఎం రేవంత్ రెడ్డి గీతకార్మికులతో సహపంక్తి భోజనం చేసి వీటి పంపిణీని ప్రారంభింస్తారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్, ఇతర మంత్రులు పాల్గొంటారు. పూర్వ కాలం నుంచి ఒకే విధమైన మోకు, ముత్తాదును గీత కార్మికులు వినియోగిస్తున్నారు. వాటితో తాటిచెట్టు ఎక్కేటప్పుడు ప్రమాదవశాత్తూ జారితే కిందపడి ప్రాణాలు కోల్పోవడమో, కాళ్లు, చేతులు, నడుములు  విరిగి మంచానికే పరిమితమయ్యే పరిస్థితి. రాష్ట్రంలో ఏటా సగటున సుమారు 500 మందికిపైగా ప్రమాదాలకు గురవుతున్నారు. వీరిలో 200 మంది వరకు ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ దుస్థితి నుంచి బయటపడేసేందుకు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, టాడీ కార్పొరేషన్ కమిషనర్ బుర్రా వెంకటేశం సూచనల మేరకు పలు ఏజెన్సీలు సేఫ్టీ మోకులను రూపొందించాయి. 

హైదరాబాద్‌‌ ఐఐటీతో కలిసి ఓ ప్రైవేటు సంస్థ తయారు చేసిన సేఫ్టీ మోకును పనితీరును ఈ ఏడాది ఫిబ్రవరిలో యాదగిరిగుట్టలో అధికారులు ప్రాక్టికల్ గా పరిశీలించారు. పనితీరు, సేఫ్టీ బాగుండడంతో వాటిని ఫైనల్ చేశారు. ప్రభుత్వం ఇచ్చే ఈ సేఫ్టీ మోకు కిట్‌‌లో మొత్తం ఆరు పరికరాలు ఉంటాయి. తాడు, క్లిప్పులు, హ్యాండిల్స్‌‌, స్లింగ్ బ్యాగ్, లెగ్‌‌‌లూప్(బెల్ట్) ఉంటాయి. ప్రస్తుతం వాడే మోకుకు అదనంగా ఈ బలమైన రోప్ ను బిగిస్తారు. అలాగే గీత కార్మికుల నడుముకు ఉండే ముస్తాదుతోపాటు చుట్టూ బెల్ట్ బిగిస్తారు. తాడి చెట్టు ఎక్కేటప్పుడు మోకు కు ఉండే సేఫ్టీ రోప్ ను వారి నడుముకు ధరించిన బెల్ట్ కు బిగిస్తారు. దీంతో తాటిచెట్టు ఎక్కేటప్పుడు, దిగేటప్పుడు ప్రమాదవశాత్తు జారినా కిందపడకుండా ఆపేస్తుంది. దీంతో ప్రాణాపాయం తప్పడంతోపాటు గాయాలు అయ్యే ముప్పు ఉండదు. రాష్ట్రంలోని గీతకార్మికులకు ఉచితంగా ఈ సేఫ్టీ మోకుల పంపిణీకి రాష్ట్ర సర్కార్ సిద్ధమైంది.