- బ్యాంక్ గ్యారంటీ ఇచ్చే మిల్లర్లకే కేటాయించాలని సర్కార్ నిర్ణయం
- జిల్లాల వారీగా గోడౌన్స్ సిద్ధం చేయాలని అధికారులకు ఆదేశం
- మిల్లర్ల డిమాండ్లకు తలొగ్గని ప్రభుత్వం.. అక్రమాలకు అడ్డుకట్ట
హైదరాబాద్, వెలుగు: సీఎంఆర్ కోసం ఇచ్చే వడ్లతో మిల్లర్లు అక్రమాలకు పాల్పడుతుండడంతో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. గత బీఆర్ఎస్ ప్రభుత్వం మాదిరి రూ. వేల కోట్ల వడ్లను గుడ్డిగా మిల్లర్లకు అప్పగించకుండా నేరుగా గోదాములకు తరలించి నిల్వ చేయాలని భావిస్తున్నది. ఆ తర్వాత బ్యాంక్ గ్యారంటీ ఇచ్చే మిల్లర్లకే ధాన్యం కేటాయించాలని నిర్ణయించింది. ముఖ్యంగా సన్న వడ్ల విషయంలో మిల్లర్లు పెట్టిన డిమాండ్లకు తలొగ్గని ప్రభుత్వం.. కొనుగోళ్లు ప్రారంభమయ్యాక మిల్లర్లు మొండికేసినా ఎలాంటి ఇబ్బందుల్లేకుండా సన్న వడ్లను నేరుగా గోదాములకే తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నది. ఈ మేరకు సివిల్ సప్లయ్స్ శాఖ చేసిన ప్రతిపాదనలకు ఇప్పటికే గ్రీన్ సిగ్నల్ఇచ్చింది. ఇందుకు సంబంధించిన ఉత్తర్వులు త్వరలోనే వచ్చే అవకాశం ఉంది. ఇటీవల కేబినెట్ సబ్ కమిటీ సమావేశం సందర్భంగా మిల్లర్లు తమ ప్రతిపాదనలను ప్రభుత్వం ముందుంచారు. ఎలాంటి బ్యాంక్ గ్యారంటీ లేకుండా ధాన్యం కేటాయించాలని డిమాండ్ చేశారు. కానీ అందుకు ఒప్పుకోని ప్రభుత్వం.. ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించింది. అందులో భాగంగానే వడ్లను నిల్వ చేసేందుకు జిల్లాల వారీగా గోదాములు రెడీ చేయాలని అధికారులను ఆదేశించింది. కాగా, ఈసారి సొంత మిల్లులు ఉన్నోళ్లు 25%, లీజుదారులు 50% బ్యాంక్గ్యారంటీ చెల్లిస్తేనే ధాన్యం కేటాయిస్తామని మిల్లర్లకు సర్కార్ స్పష్టం చేసింది.
దీనికి మిల్లర్లు అంగీకరించకపోవడంతో చర్చలు కొలిక్కి రాలేదు. అయితే, ఇప్పటికే పలు జిల్లాల్లో కొనుగోళ్లు ప్రారంభమయ్యాయి. ఇదే అదనుగా ధాన్యం దించుకోవడానికి మిల్లర్లు మొండికేస్తే కొనుగోళ్లు నిలిచిపోయే ప్రమాదం ఉంది. అందుకే మిల్లర్ల ఆటలు సాగకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్న ప్రభుత్వం.. ముఖ్యంగా సన్నవడ్ల కొనుగోళ్లకు ఎలాంటి ఇబ్బంది రాకుండా వాటిని నేరుగా గోదాములకు తరలించాలని భావిస్తున్నది. ఇప్పటికే గోదాముల్లో ఉన్న నిల్వలను ఖాళీ చేయించాలని అధికారులకు ఆదేశాలిచ్చింది.
అంచనా 91 లక్షల టన్నులు..
రాష్ట్రంలో ఈసారి వానాకాలంలో రికార్డు స్థాయిలో 66.73 లక్షల ఎకరాల్లో వరి సాగైంది. ఇందులో 58 శాతం సన్న రకాలే. సన్న వడ్లకు రూ.500 బోనస్ ఇస్తామని సర్కార్ ప్రకటించడంతో రైతులు ఎక్కువగా అవే సాగు చేశారు. ఈ నేపథ్యంలో ఈసారి కొనుగోలు సెంటర్లకు భారీగా సన్నవడ్లు వస్తాయని సివిల్సప్లయ్స్ ఆఫీసర్లు భావిస్తున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి రికార్డు స్థాయిలో 1.46 కోట్ల టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందని వ్యవసాయ శాఖ అంచనా వేసింది. ఇందులో ట్రేడర్లు, మిల్లర్లు, కొనుగోలు చేసే ధాన్యం, రైతులు తమ అవసరాలకు ఉంచుకునే నిల్వలు పక్కనపెడితే దాదాపు 91 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు చేయాల్సి ఉంటుందని లెక్క తేల్చింది. ఇందులో 44 లక్షల టన్నులు దొడ్డు రకం, 47 లక్షల టన్నులు సన్న రకం సెంటర్లకు వస్తాయని సివిల్సప్లయ్స్ శాఖ అంచనా వేసింది.
రాష్ట్రంలో 1,544 గోదాములు
ప్రస్తుతం రాష్ట్రంలో 1,544 గోదాములు ఉన్నాయి. అగ్రికల్చర్ మార్కెటింగ్ శాఖ ఆధ్వర్యంలో 1,167 ప్రభుత్వ గోదాములు ఉండగా, వాటి కెపాసిటీ 24.85 లక్షల టన్నులుగా ఉంది. సెంట్రల్ వేర్ హౌసింగ్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో 4.28 లక్షల టన్నులు, స్టేట్ వేర్ హౌసింగ్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో 7.24 లక్షల టన్నులు, ఎఫ్సీఐ ఆధ్వర్యంలో 6.67 లక్షల టన్నులు, సివిల్ సప్లయ్స్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో 76 వేల టన్నులు, మార్క్ఫెడ్ ఆధ్వర్యంలో 84 వేల టన్నుల చొప్పున కెపాసిటీ ఉన్న గోదాములు అందుబాటులో ఉన్నాయి. ఇక ఐజీఎస్ ఆధ్వర్యంలో 26.56 లక్షల టన్నుల కెపాసిటీ ఉన్న గోదాములు ఉన్నాయి. వడ్ల నిల్వ కోసం దాదాపు 20 లక్షల నుంచి 40 లక్షల టన్నుల కెపాసిటీ కోసం ప్రభుత్వం ఏర్పాట్లు
చేస్తున్నట్టు తెలిసింది.
అక్రమాలకు అడ్డుకట్ట వేసేందుకే..
గతంలో సీఎంఆర్ కోసం కేటాయించిన వడ్లతో కొందరు మిల్లర్లు అక్రమాలకు పాల్పడ్డారు. వడ్లను పక్కదారి పట్టించి, ప్రభుత్వానికి బియ్యం ఎగ్గొట్టారు. అలాంటోళ్లపై క్రిమినల్ కేసులు పెట్టడంతో పాటు ఆస్తుల జప్తు వంటి చర్యలు తీసుకున్నా పెద్దగా ఫలితం లేకుండా పోయింది. దీంతో అక్రమాలకు అడ్డుకట్ట వేయాలంటే, రూల్స్ మార్చాలని భావిస్తున్న ప్రభుత్వం.. బ్యాంక్ గ్యారంటీని తప్పనిసరి చేయాలని నిర్ణయించింది. మరోవైపు ఈసారి వడ్ల కొనుగోళ్ల కోసం ఏర్పాటు చేసిన కేబినెట్ సబ్ కమిటీ ముందు మిల్లర్లు పలు డిమాండ్లు ఉంచారు. సన్నవడ్లు మిల్లింగ్ చేస్తే సర్కార్ చెప్తున్నట్టు 67 శాతం బియ్యం రావని.. 58 శాతం బియ్యం, 9 శాతం నూకలు ఇస్తామని చెప్పారు. అలాగే, వరి ధాన్యంలో తేమ 17శాతం కాకుండా 14 శాతానికి మార్చాలని అడుగుతున్నారు. 32 రకాల ధాన్యాన్ని సన్న రకాలుగా గుర్తించాలని.. మిల్లింగ్ చార్జీలు, ధాన్యం నిల్వ చేసిన చార్జీలు కూడా ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. వీటికి ప్రభుత్వం ఒప్పుకోకపోవడంతో చర్చలు ఇంకా కొలిక్కి రాలేదు.