స్కూల్ బస్సుల ఫిట్​నెస్ రెగ్యులర్​గా చెక్ చేయాలి : పొన్నం ప్రభాకర్

స్కూల్ బస్సుల ఫిట్​నెస్  రెగ్యులర్​గా చెక్ చేయాలి : పొన్నం ప్రభాకర్
  • ఓవర్ లోడ్​తో వెళ్తున్న స్టూడెంట్ల ఆటోలపై చర్యలు తీసుకోండి
  • రవాణ శాఖపై రివ్యూలో మంత్రి వెల్లడి

హైదరాబాద్, వెలుగు: స్కూల్ బస్సుల ఫిట్​నెస్ విషయంలో కఠినంగా వ్యవహరించాలని అధికారులకు మంత్రి పొన్నం ప్రభాకర్ ఆదేశించారు. స్టూడెంట్లను ఎక్కించుకుని ఓవర్​లోడ్ తో వెళ్తున్న ఆటోలను గుర్తించి చర్యలు తీసుకోవాలన్నారు. ప్రతి రోజూ ఈ తనిఖీలు నిర్వహించాలని ఆదేశించారు. సెక్రటేరియెట్​లో రవాణా శాఖపై మంత్రి పొన్నం ప్రభాకర్ అధికారులతో బుధవారం రివ్యూ చేపట్టారు. 

ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ‘‘ట్రాన్స్​పోర్ట్ డిపార్ట్​మెంట్​లో లక్ష్యానికి అనుగుణంగా ఆదాయ మార్గాలు పెంచాలి. గతంలో సీఎం రేవంత్ రెడ్డి పలు సూచనలు చేశారు. వాటిని పక్కాగా అమలు చేయాలి. రోడ్ సేఫ్టీ అవగాహన కోసం టెక్నాలజీని ఉపయోగించుకోవాలి. దేశ వ్యాప్తంగా ప్రతి ఏడాది యాక్సిడెంట్ల కారణంగా 1.20 లక్షల మంది చనిపోతున్నారు. తెలంగాణలో రోజుకు 20 మంది ప్రాణాలు కోల్పోతున్నారు’’అని పొన్నం అన్నారు.  
 
అధికారులకు ట్యాబ్​లు ఇవ్వండి

స్క్రాప్, ఆటోమేటిక్ టెస్టింగ్ స్టేషన్స్ వంటి ట్రాన్స్​పోర్టు పాలసీలను అధ్యయనం చేసేందుకు అధికారుల బృందం ఇప్పటికే వివిధ రాష్ట్రాలను సందర్శించింది. ఈ మేరకు సమగ్ర నివేదికను మంత్రికి అందజేసింది. రిపోర్టును పరిశీలించిన పొన్నం.. పలు సూచనలు చేశారు. తుది నివేదికను తయారు చేయాలని ఆదేశించారు. ‘‘రవాణా శాఖ కార్యాలయాలు ఎక్కడెక్కడ ప్రైవేట్ బిల్డింగుల్లో కొనసాగుతున్నాయో వివరాలు సేకరించండి. ప్రభుత్వ స్థలాల కోసం కలెక్టర్​లకు లెటర్లు పెట్టండి. రవాణా శాఖ అధికారులకు ట్యాబ్​లు ఇవ్వడంతో పాటు ఫీల్డ్ విజిట్ చేసేందుకు వాహన సౌకర్యం ఏర్పాటు చేయాలి’’అని పొన్నం సూచించారు.