35 వేల మంది నల్​జల్​ మిత్రలకు శిక్షణ

35 వేల మంది నల్​జల్​ మిత్రలకు శిక్షణ

హైదరాబాద్, వెలుగు: తాగునీటి వ్యవస్థను మరింత మెరుగు పరిచేందుకు రాష్ట్ర ప్రభుత్వం పక్కా ప్రణాళికతో ముందుకు సాగుతున్నది. ఇందులో భాగంగా గ్రామాల్లో మంచినీటి సహాయకులకు శిక్షణ ఇస్తున్నది. మండల కేంద్రాల్లో నల్​జల్​మిత్ర పేరుతో 35 నుంచి 45 మంది మంచినీటి సహాయకులకు ట్రైనింగ్​ ఇస్తున్నారు. 15 నుంచి 20  గ్రామాల మంచినీటి సహాయకులకు ఒకేచోట శిక్షణ ఇస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 1,719 శిక్షణ కార్యక్రమాలు నిర్వహించేలా ప్రణాళిక రూపొందించగా.. ఇప్పటి వరకు 1,055 ట్రైనింగ్స్​ పూర్తయ్యాయి. 

మొత్తం 35 వేల నుంచి 40 వేల మంది మంచినీటి సహాయకులు శిక్షణ పూర్తి చేసుకున్నారు.మాస్టర్​ ట్రైనర్లు వాటర్​క్వాలిటీ టెస్టింగ్, బోర్లు, మోటార్ల మరమ్మతులు, వాటి నిర్వహణ, పైపులైన్ల లీకేజీలు, నల్లా కనెక్షన్లు, వాటర్​ ట్యాంకులలో ఫ్లోరినేషన్ తదితర అంశాలపై ట్రైనింగ్ ఇస్తున్నారు. మిషన్​ భగీరథ ఏఈఈలు, పంచాయతీరాజ్​అధికారుల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ ట్రైనింగ్ కు మంచి స్పందన వస్తున్నది. రాష్ట్ర వ్యాప్తంగా అక్టోబర్​లో శిక్షణ కార్యక్రమాలు పూర్తి చేయాలన్న సంకల్పంతో ముందుకు సాగుతోంది. నల్గొండ జిల్లాలో అత్యధిక గ్రామ పంచాయతీలు ఉండడంతో కొంత ఆలస్యమయ్యే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.