- ఆ కంపెనీల భూములు వెనక్కి తీసుకోండి
- ప్రభుత్వాన్ని ఆదేశించిన హైకోర్టు
హైదరాబాద్, వెలుగు: ఇందూటెక్ జోన్, బ్రాహ్మణితో సహా పలు కంపెనీలకు కేటాయించిన భూమిని స్వాధీనం చేసుకోవాలని రాష్ట్ర సర్కారును హైకోర్టు ఆదేశించింది. భూ కేటాయింపులు జరిగినా.. పనులు ప్రారంభించని ఇందూటెక్ జోన్, బ్రాహ్మణి ఇన్ఫ్రా టెక్ లిమిటెడ్‌తో సహా జేటీ హోల్డింగ్స్, స్టార్‌గేజ్ ప్రాపర్టీస్, అనంత టెక్నాలజీస్ కు కేటాయించిన భూమిని నాలుగు నెలల్లో రద్దు చేసేందుకు చర్యలు తీసుకోవాలని సూచించింది. ఇదే సమయంలో భూములు పొందిన కంపెనీల నుంచి మార్కెట్ ధర ప్రకారం ప్రభుత్వం డబ్బులు వసూలు చేయాలన్న పిటిషనర్ అభ్యర్థనను తిరస్కరించింది.
భూ కేటాయింపులనేది ప్రభుత్వ విధానమని, ఈ విషయంలో జోక్యం చేసుకోబోమని వెల్లడించింది. 2007 నాటి పిల్‌పై విచారణను మూసివేస్తున్నట్లు ప్రకటించింది. ఉమ్మడి ఏపీలో 2001 నుంచి 2006 మధ్య పలు పరిశ్రమలు, సంస్థలు, వ్యక్తులకు చేసిన భూ కేటాయింపును సవాల్ చేస్తూ చత్రి అనే స్వచ్ఛంద సంస్థ 2007లో హైకోర్టులో పిల్ వేసింది. దీనిపై చీఫ్ జస్టిస్ అలోక్ ఆరాధే, జస్టిస్ జే.శ్రీనివాస రావుతో కూడిన డివిజన్ బెంచ్ జడ్జిమెంట్ వెలువరించింది.