న్యూఢిల్లీ, వెలుగు: కాంగ్రెస్పార్టీ అగ్రనేత, లోక్ సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, వయనాడ్ఎంపీ ప్రియాంక గాంధీని పంచాయితీ రాజ్, గ్రామీణాభివృద్ధి, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క మర్యాదపూర్వకంగా కలిశారు. మంగళవారం ఢిల్లీలో పార్లమెంట్ లో భవనంలో రాహుల్ తో ప్రత్యేకంగా సమావేశమయ్యారు.
ఈ సందర్బంగా రాష్ట్రంలోని తాజా రాజకీయ పరిస్థితులపై చర్చించారు. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తయిన సందర్భంగా.. ఇచ్చిన ఆరు గ్యారంటీలు, ఇతర సంక్షేమ పథకాల అమలు తీరు, ఇతర అంశాలను వివరించారు. ప్రధానంగా మహిళలు, ఎస్సీ, ఎస్టీ వర్గాల అభ్యున్నతి విషయంలో రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న సానుకూల విధానాలను తెలిపారు.
ఈ సందర్భంగా మంత్రి సీతక్క ను రాహుల్ అభినందించినట్టు తెలిసింది. ఏడాదిలో సీఎం రేవంత్ నేతృత్వంలో మంత్రుల పనితీరు భేష్ గా ఉందన్నారు. బీసీ కులగణన, సామాజిక అభివృద్ధి విషయంలోనూ మరింత ముందుకు సాగాలని మంత్రికి రాహుల్ దిశా నిర్దేశం చేశారు.
అనంతరం వయనాడ్ ఎంపీ ప్రియాంక గాంధీని మంత్రి సీతక్క కలిశారు. వయనాడ్ బై ఎన్నికల్లో ఘన విజయం సాధించిన ఆమెకు అభినందనలు తెలిపారు. ఎన్నికల వేళ ఇచ్చిన హామీలను తెలుసుకునేందుకు రాష్ట్రానికి రావాలని ప్రియాంకను కోరినట్టు సమాచారం. ఈ భేటీ అనంతరం మంత్రి సీతక్క తిరిగి హైదరాబాద్ కు వచ్చారు.