- 24 మందిపై చర్యలకుసిద్ధమైన టీజీ న్యాబ్
- అరెస్ట్ చేసినా బెదరని గంజాయి సప్లయర్స్
- బెయిల్‌పై వచ్చి మళ్లీ గాంజా, డ్రగ్స్ దందా
- రూ.కోట్ల టర్నోవర్‌తో ట్రాన్స్‌పోర్ట్ నెట్‌వర్క్
- ఖరీదైన కార్లు, ప్రాపర్టీస్, ఇన్వెస్ట్‌మెంట్స్
- సఫెమా యాక్ట్‌తో పెడ్లర్స్ పని పడుతున్న టీజీన్యాబ్
హైదరాబాద్, వెలుగు: అరెస్ట్ చేసినా బెదరకపోవడంతో గంజాయి, డ్రగ్స్ పెడ్లర్స్ పై మరింత కఠిన చర్యలకు తెలంగాణ యాంటీ నార్కోటిక్స్ బ్యూరో(టీన్యాబ్) సిద్ధమైంది. 24 మంది పెడ్లర్స్ ఆస్తులను జప్తు చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేసింది. నిందితులపై నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్‌స్టాన్సెస్ యాక్ట్ (ఎన్‌డీపీఎస్)తో పాటు ‘స్మగ్లింగ్ అం డ్ ఫారిన్ ఎక్స్చేంజ్ మానిప్యులేటర్స్ యాక్ట్’(- సఫెమా) ను అమలు చేస్తున్నది. ఈ మేరకు చెన్నైలోని ‘సౌత్ ఇండియా సఫెమా కాంపిటెంట్ అథారిటీ’కి రిపోర్ట్ పంపించారు.
వీరి వద్ద స్వాధీనం చేసుకున్న డ్రగ్స్, గంజాయి, వాహనాల విలువతోపాటు మాదకద్రవ్యాల సప్లయ్ ద్వారా నిందితులు సంపాదించిన ఆస్తుల వివరాలను వెల్లడించారు. డ్రగ్స్, గంజాయి ఇతర మాదకద్రవ్యాలు సప్లయ్ చేయడం ద్వారా ఆస్తులు సంపాదించారని కాంపిటెంట్ అథారిటీ విచారణలో తేలితే వాటిని ఆయా రాష్ట్రాల ప్రభుత్వాలకు అప్పగిస్తారు. ఎన్‌డీపీఎస్ యాక్ట్ ప్రకారం జైలు శిక్షతోపాటు సఫెమా యాక్ట్ ప్రకారం నిందితుల ఆస్తులను జప్తు చేస్తారు.
గ్రామాల్లోనూ విస్తరిస్తున్న గంజాయి కల్చర్
గంజాయి, డ్రగ్స్ కల్చర్ పట్టణాల నుంచి గ్రామాలకు పాకింది. గంజాయి మత్తుకు బానిసలైన యువత ఈజీ మనీ కోసం తామే సప్లయర్స్‌గా మారుతున్నారు. దీంతో హైదరాబాద్‌తోపాటు రాష్ట్ర వ్యాప్తంగా గంజాయి చైన్ లింక్ పెరిగిపోతున్నది. ఇదే అవకాశంగా చేసుకుని గంజాయి, డ్రగ్స్ సప్లయర్స్ ఆర్గనైజ్డ్ నెట్‌వర్క్ ఏర్పాటు చేసుకున్నారు. విశాఖ, ఒడిశా ఏజెన్సీ ప్రాంతాల నుంచి హైదరాబాద్ మీదుగా దేశవ్యాప్తంగా ట్రాన్స్‌పోర్ట్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే గ్రేటర్ హైదరాబాద్‌తో పాటు ఉత్తర తెలంగాణ జిల్లాల్లో ఏజెంట్స్ నెట్‌వర్క్ ఏర్పాటు చేసుకున్నారు. వీరి ద్వారా స్థానికంగా గంజాయి అమ్మకాలు జరుపుతూనే ఇతర రాష్ట్రాలకు ట్రాన్స్‌పోర్ట్ చేస్తున్నారు.
సమగ్ర సమాచారం సేకరణ
గంజాయి, డ్రగ్స్సప్లయ్ చేస్తూ పట్టుబడినవారు ఎంతకాలంగా ఈ దందా చేస్తున్నారు? గంజాయి దందాకు ముందు ఏ పని చేసేవారు? ఆ తర్వాత ఎంత సంపాదించారు? అనే వివరాలను రాబడుతున్నారు. ఇలా సంపాదించిన డబ్బుతో కూడబెట్టిన ఆస్తులు, బినామీ పేర్లతో ఉన్న స్థిర, చర ఆస్తులతో కూడిన రిపోర్ట్‌ను సిద్ధం చేస్తున్నారు. ప్రాపర్టీస్ సీజ్ చేసి కోర్టులకు అందిస్తున్నారు. స్థానిక కోర్టుల అనుమతితో స్మగ్లింగ్ అండ్ ఫారిన్ ఎక్స్చేంజ్ మానిప్యులేటర్స్ యాక్ట్( సఫెమా) ప్రపోజల్స్ సిద్ధం చేస్తున్నారు. ఈ యాక్ట్ ప్రకారం.. నిందితులు మాదకద్రవ్యాల సరఫరాతో సంపాదించిన డబ్బు, బిల్డింగ్స్, భూములు, ఖరీదైన కార్లు,పెట్టుబడులు పెడితే వాటిని జప్తు చేసే అవకాశాలు ఉన్నాయి.
చెన్నైలో విచారణకు వెళ్లాల్సిందే
పెడ్లర్స్‌పై సఫెమా యాక్ట్ కింద కేసు నమోదైతే చెన్నైలోని ‘సౌత్ ఇండియా సఫెమా కాంపిటెంట్ అథారిటీ’ విచారణ జరుపుతుంది. ఇందుకోసం కేసు వివరాలతోపాటు నిందితులు, పట్టుబడిన గంజాయి లేదా డ్రగ్స్, సీజ్ చేసిన ప్రాపర్టీకి సంబంధించిన డాక్యుమెంట్లను అథారిటీకి పోలీసులు రిపోర్ట్ చేస్తారు. కాంపిటెంట్ అథారిటీ ఆయా నిందితుల ఆస్తులపై విచారణ జరుపుతుంది. విచారణకు ముందు నిందితులకు నోటీసులు జారీ చేస్తుంది. పోలీసులు అందించిన వివరాలతోపాటు నిందితుల వ్యక్తిగత జీవితాలు, వారి ఆస్తులకు సంబంధించిన పూర్తి వివరాలు రాబడుతుంది. మాదక ద్రవ్యాలను విక్రయించడం, సప్లయ్ చేయడం ద్వారానే ఆస్తులు సంపాదించి నట్లు తేలితే జప్తు చేసేందుకు ఆదేశాలు జారీ చేస్తుంది. దీంతోపాటు రిపీటెడ్‌గా పట్టుబడుతున్న పెడ్లర్స్‌పై ప్రివెంటివ్ డెటె న్షన్ (పీడీ) యాక్ట్ తరహాలోనే ‘ ప్రివెన్షన్ ఆఫ్ ఇల్లిసిట్ ట్రాఫిక్ ఇన్ నార్కోటిక్ డ్రగ్ సైకోట్రోపిక్’, పదార్థాల అక్రమ రవాణా నిరోధక చట్టం(పీఐటీ ఎన్‌డీపీఎస్)యాక్ట్‌ను ప్రయోగిస్తున్నారు.
ఈ చట్టాల ప్రకారం రెండేండ్ల వరకు బెయిల్ లభించే అవకాశం ఉండదు.
‘‘మంగళ్‌హాట్‌కు చెందిన లఖన్ సింగ్ గత పదేండ్లుగా గంజాయి స్మగ్లింగ్ చేస్తున్నాడు. ఒడిశా నుంచి గంజాయి కొనుగోలు చేసి స్థానికంగా విక్రయిస్తున్నాడు. 2 సార్లు పీడీ యాక్ట్ ప్రయోగించినా లఖన్‌సింగ్‌లో మార్పు రాలేదు. ఈ ఏడాది జులైలో మరో నలుగురు సభ్యుల ముఠాతో కలిసి టీజీ న్యాబ్ పోలీసులకు చిక్కాడు. పోలీసులు స్కార్పియో వెహికల్ సహా 155 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.లఖన్‌సింగ్ ఆస్తులను అటాచ్ చేసేందుకు ప్రపోజల్స్‌తో సఫెమా కాంపిటెంట్ అథారిటీకి రిపోర్ట్ పంపించారు.’’
‘‘సంగారెడ్డి జిల్లాకు చెందిన గోసుకొండ అంజిరెడ్డి మరో ముగ్గురితో కలిసి సిటీ శివారు ప్రాంతాల్లోని బల్క్ డ్రగ్ మాన్యుఫాక్చరింగ్ కంపెనీల్లో యాంఫేటమిన్ డ్రగ్ సేకరించేవాడు.ఈ డ్రగ్‌ను కిలోల చొప్పున ప్యాక్ చేసి సిటీలోని కల్లు దుకాణాలకు సప్లయ్ చేసేవాడు. ఇలా గత మూడేండ్లుగా డ్రగ్ సప్లయ్ చేస్తున్నాడు. ఈ ఏడాది ఆగస్టులో అంజిరెడ్డి గ్యాంగ్‌ను టీజీ న్యాబ్ పోలీసులు అరెస్ట్ చేశారు. వీరి వద్ద రూ..8.5 కోట్లు విలువ చేసే డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. అంజిరెడ్డి ఆస్తుల వివరాలు సేకరించారు. యాంఫేటమిన్ డ్రగ్ సప్లయ్ చేస్తున్న నాటి నుంచి సంపాదించిన ఆస్తుల డాక్యుమెంట్లతో సఫెమా కాంపిటెంట్ అథారిటీకి రిపోర్ట్ పంపించారు.’’