
- టీజీఎండీసీ ఆధ్వర్యంలో సరఫరా
- అక్రమ రవాణాకు చెక్ పెట్టండి.. మైనింగ్ శాఖ రివ్యూలో సీఎం రేవంత్
- నిర్మాణ సంస్థలకు, ప్రభుత్వపనులకూ ఇసుక సప్లై చేయండి
- హైదరాబాద్‌కు మూడు వైపులా శాండ్ పాయింట్లు ఏర్పాటు చేయాలి
- గనుల అక్రమ తవ్వకాలకూ అడ్డుకట్ట వేయాల్సిందేనని అధికారులకు ఆదేశం
హైదరాబాద్, వెలుగు: తెలంగాణ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (టీజీఎండీసీ) నుంచే ఇసుకను డోర్ డెలివరీ చేసే విధానాన్ని త్వరగా తీసుకురావాలని అధికారులను సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశించారు. ఇందుకోసం ప్రత్యేక యాప్‌ను తీసుకురావాలని, ఎవరికి అవసరం ఉంటే వాళ్లే ఇసుకను బుక్ చేసుకుంటే సరఫరా చేసేలా వ్యవస్థ ఉండాలని ఆయన సూచించారు. మైనింగ్ శాఖపై శనివారం కమాండ్ కంట్రోల్ సెంటర్లో సీఎం రేవంత్ రెడ్డి సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇసుకను అవసరాల మేర బుక్ చేసుకునేలా మినిమమ్ క్వాంటిటీ పెట్టి సరఫరా చేస్తే ప్రభుత్వానికి ఆదాయం రావడంతో పాటు అక్రమ రవాణాకు చెక్ పెట్టినట్టవుతుందని పేర్కొన్నారు. పెద్ద మొత్తంలో నిర్మాణాలు చేపట్టే నిర్మాణ రంగ సంస్థలకు అవసరమైన ఇసుకను కూడా టీజీఎండీసీ ద్వారానే సరఫరా చేయాలని అధికారులను ఆదేశించారు.
ఇసుకతో పాటు ఇతర గనుల అక్రమ తవ్వకాలు, అక్రమ సరఫరాపై ఉక్కుపాదం మోపాలని అధికారులను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. కఠిన చర్యలతోనే అక్రమాలను అడ్డుకోగలమని, ప్రభుత్వానికి ఆదాయం పెంచగలమని చెప్పారు. గత నెల రోజులుగా తీసుకున్న చర్యలతో ఇసుక అక్రమ రవాణాకు అడ్డుకట్ట పడిన విధానాన్ని, పెరిగిన ఆదాయాన్ని సీఎంకు అధికారులు వివరించారు. గత ఏడాది ఇసుక రెవెన్యూ రూ. 567 కోట్లు రాగా, ఈ ఏడాది రూ.630 కోట్ల వచ్చిందన్నారు. ఇసుక రీచ్‌లు, యార్డుల దగ్గర సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామని వారు తెలిపారు. స్టేట్ లెవల్ లో అన్ని శాఖల సమన్వయంతో టాస్క్‌ఫోర్స్ కమిటీ ఏర్పాటు చేసి ఇసుక అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేస్తున్నట్లు ఆఫీసర్లు వివరించారు.
ఇసుక రీచ్‌ల్లో తవ్వకాలు, రవాణా, వినియోగదారులకు తక్కువ ధరకు ఇసుక సరఫరాపై అధికారులకు సీఎం పలు సూచనలు చేశారు. హైదరాబాద్ నగరంతో పాటు సమీప ప్రాంతాల్లోనే ఇసుక ఎక్కువగా వినియోగం జరుగుతున్నదన్నారు. తక్కువ మొత్తంలో ఇసుక అవసరమైన వారు కొనుగోలు చేసేలా నగరానికి మూడు వైపులా ఇసుక స్టాక్ పాయింట్లు సాధ్యమైనంత త్వరగా ఏర్పాటు చేయాలని సీఎం ఆదేశించారు. గనుల శాఖ పరిధిలోని వివిధ ఖనిజాల క్వారీలకు గతంలో విధించిన జరిమానాలు, వాటి వసూళ్లపై అధికారులను సీఎం ప్రశ్నించారు.
ఇందుకు సంబంధించిన విధానపరమైన నిర్ణయం త్వరగా తీసుకొని సమస్యను పరిష్కరించాలని ఆదేశించారు. దీర్ఘకాలంగా పెండింగ్‌లోఉన్న మైనర్ ఖనిజాల బ్లాక్‌ల వేలానికి వెంటనే టెండర్లు పిలవాలని చెప్పారు. సమీక్షలో సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, టీజీఎండీసీ చైర్మన్ ఈరవత్రి అనిల్ కుమార్, సీఎం సలహాదారు (మౌలిక వసతులు) శ్రీనివాసరాజు, సీఎం ప్రిన్సిపల్ సెక్రటరీ వి.శేషాద్రి, సీఎం సెక్రటరీ మాణిక్ రాజ్, రాష్ట్ర గనుల శాఖ డైరెక్టర్ కె.శశాంక, గనుల శాఖ కార్యదర్శి ఎన్.శ్రీధర్, టీజీఎండీసీ ఎండీ సుశీల్ కుమార్ పాల్గొన్నారు.