హైదరాబాద్ సిటీ, వెలుగు : ఒకప్పుడు పిల్లలంటే ఆటలు, పాటలు, చిలిపి పనులు, చిన్న చిన్న కొట్లాటలు, అమ్మా నాన్నలతో అప్పుడప్పుడు చిన్నగా చెంప దెబ్బలు తినడం లాంటివి గుర్తుచ్చేవి. కానీ.. ఇప్పుడు ట్రెండ్ మారింది. ఇప్పటి పిల్లలు సెల్‌ఫోన్, టీవీలతోనే ఎక్కువ టైం గడిపేస్తున్నారు. సెల్‌ఫోన్ చేతిలో లేనిదే ముద్ద దిగదు అనేవాళ్లు కూడా ఉన్నారు. ఎప్పుడూ ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ఎక్స్, స్నాప్‌చాట్ లాంటి యాప్స్‌తో బిజీగా ఉంటున్నారు. అయితే.. ఈ టెక్ యుగంలో టెక్నాలజీ వాడకం మంచిదే. కానీ.. టెక్నాలజీ ముసుగులో ఉన్న అసభ్యత, అశ్లీలత పిల్లల్ని పక్కదారి పట్టించే ప్రమాదం ఉంది. అందుకే బాల్యాన్ని భద్రంగా కాపాడేందుకు తెలంగాణ పోలీసులు ఈ డిజిటల్ బుక్‌ని అందుబాటులోకి తీసుకొచ్చారు.
ప్రస్తుత స్పీడ్ జనరేషన్లో ప్రతి ఒక్కరూ టెక్నాలజీని వాడుకోవాల్సిందే. కానీ.. దాన్ని సరైన మార్గంలో వాడకపోతే నేటి తరానికి ముప్పు తప్పదు అంటున్నారు పోలీసులు. ప్రతి చేతిలో కనిపించే ఆ ఫోన్లోనే బాల్యాన్ని చిదిమేసే, పిల్లలను పక్కదారి పట్టించే అనేక యాప్‌లు, వీడియోలు పొంచి ఉంటున్నాయి. చదువుకోవడానికి, కొత్త విషయాలు తెలుసుకోవడానికి పిల్లలకు మొబైల్ ఫోన్ ఇవ్వడం తప్పనిసరి అయ్యింది. కానీ.. పిల్లలు సరైన పద్ధతిలో ఫోన్ వాడకపోవడంతో సైబర్ విష వలయంలో చిక్కుకుంటున్నారు. అందుకే అలాంటి మోసపూరిత యాప్‌ల నుంచి పిల్లలను ఎలా రక్షించుకోవాలో చెప్పేందుకు తెలంగాణ పోలీసులు ప్రత్యేక హ్యాండ్‌బుక్ రిలీజ్ చేశారు. భావితరాలకు సైబర్ సేఫ్టీని అందించేందుకు దాన్ని ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంచారు. తెలుగు, ఇంగ్లీష్ బాషల్లో ఉన్న పేరెంటల్ గైడెన్స్ ఈ–వెర్షన్‌ని https://tgcsb.tspolice.gov.in/ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. సైబర్ ముప్పు నుంచి పిల్లలను ఎలా కాపాడుకోవాలి అనేదానిపై తల్లిదండ్రులకు అవగాహన కల్పించేందుకు సైబర్ సెక్యూరిటీ బ్యూరో వాళ్లు ఈ పుస్తకాన్ని విడుదల చేశారు.
నియంత్రణ మార్గాలేవి?
మొబైల్స్, కంప్యూటర్లు ఎలా పని చేస్తాయి? వాటిలోకి సైబర్ మోసాలకు పాల్పడే వారు చొరబడకుండా, వాటి బారిన పిల్లలు పడకుండా చూడడం ఎలా? అనేది ఈ బుక్‌లెట్‌లో వివరించారు. అలాగే పిల్లల వయస్సుకు తగ్గట్టు మార్గదర్శకాలు, ఇంటర్నెట్‌ను సురక్షితంగా వినియోగించుకోవడం, మొబైల్స్, కంప్యూటర్లు నిర్ణీత సమయంలోనే ఉపయోగించుకోవడం లాంటి వివరాలు ఇందులో ఉన్నాయి.
గుర్తించడం ఎలా?
పిల్లలు ఎక్కువ టైంని సోషల్ మీడియాలో గడపడంతోపాటు ఒంటరిగా ఫీలవుతుంటే వాళ్లు సైబర్ వలయంలో చిక్కుకున్నారని గుర్తించాలి. పిల్లలకు ఎవరైనా అసభ్య సందేశాలు, అశ్లీల వీడియోలు పంపితే వాటిని గుర్తించి స్క్రీన్ షాట్ల రూపంలో భద్రపరిచి సైబర్ ఠాణాల్లో ఫిర్యాదు చేయాలి. పిల్లలు వాటి దుష్ప్రభానికి లోనైతే టీచర్లు, కౌన్సెలర్లను సంప్రదించి వాళ్లు అందులో నుంచి బయటపడేలా చూడాలి.
ఏవిధంగా అడ్డుకోవాలి...
ఇన్‌స్టాగ్రామ్, ఎక్స్, యూట్యూబ్, స్నాప్ చాట్, ఫేస్‌బుక్ యాప్‌ల ద్వారా అసభ్య, అక్కరలేని సమాచారం చేరకుండా సెట్టింగ్స్‌లో ఎలాంటి మార్పులు చేసుకోవాలో పోలీసులు ఈ పుస్తకంలో వివరించారు. ఇతర సెట్టింగ్స్‌లో మార్పులపైనా సమగ్ర సమాచారం పొందుపర్చారు.
సైబర్ చట్టాల వివరణ
పిల్లలు సైబర్ నేరాల బారిన పడితే ఎలా రక్షించుకోవాలి? ఏ విధంగా ఫిర్యాదు చేయాలి? అందుకోసం ఎలాంటి చట్టాలు ఉపయోగపడతాయి? అనే విషయాలు కూడా ఈ బుక్‌లో ఉన్నాయి.