హెచ్– సిటీ ప్రాజెక్టు భూసేకరణ, పరిహారం అంచనాపై దానకిశోర్ సమీక్ష..

హెచ్– సిటీ ప్రాజెక్టు భూసేకరణ, పరిహారం అంచనాపై దానకిశోర్ సమీక్ష..
  • విరించి జంక్షన్, పెన్షన్ ఆఫీస్ రోడ్డు పరిశీలన

హైదరాబాద్ సిటీ, వెలుగు:  హెచ్– సిటీ ప్రాజెక్టును వేగంగా పూర్తిచేసేందుకు కార్యాచరణ సిద్ధం చేయాలని ఎంఏయూడీ ప్రిన్సిపల్ సెక్రెటరీ ఎం.దానకిశోర్ అధికారులను ఆదేశించారు. గురువారం మాసబ్ ట్యాంక్ లోని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ అర్బన్ మేనేజ్​మెంట్(ఎన్​ఐయూఎం) ఆఫీసులో హెచ్– సిటీ పనులపై జీహెచ్ఎంసీ అధికారులతో సమీక్షించారు. రూ.3,500 కోట్లతో చేపట్టనున్న 38 రోడ్ల అభివృద్ధి, రూ.150 కోట్లతో చేపట్టనున్న జంక్షన్ల అభివృద్ధి పనులపై చర్చించారు. 

125 ట్రాఫిక్ జంక్షన్లలో అడ్డుగా ఉన్న 4,100 విద్యుత్ స్తంభాలను 3 నెలల్లోగా తరలించాలని చెప్పారు. ఆ వెంటనే జంక్షన్ల బ్యూటిఫికేషన్​చేపట్టాలన్నారు. హెచ్– సిటీ ఫేజ్–-1లో భాగంగా రూ.1,230 కోట్లతో కేబీఆర్ పార్కు చుట్టూ ఆరు జంక్షన్లలో ఫ్లై ఓవర్లు, అండర్ పాసుల నిర్మాణానికి టెండర్ ప్రక్రియను ప్రారంభించాలని  సూచించారు. భూ సేకరణ, పరిహారంపై నివేదిక రెడీ చేసి తనకు అందజేయాలని జీహెచ్ఎంసీ అడిషనల్ కమిషనర్ శివ కుమార్ నాయుడును ఆదేశించారు. 

ఇంజనీరింగ్, ట్రాఫిక్ పోలీస్, విద్యుత్, వాటర్ బోర్డు, టెలికాం, టౌన్ ప్లానింగ్ శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలన్నారు. హెచ్–సిటీ ఇంప్లిమెంటేషన్ ఇంటర్ డిపార్ట్​మెంటల్ కో-ఆర్డినేషన్ కమిటీని  ఏర్పాటు చేయాలని జీహెచ్ఎంసీ కమిషనర్ ఇలంబరితికి సూచించారు. టెండర్లు పూర్తయి ఏజెన్సీలు పనులు చేపట్టేలోగా ప్రాజెక్టుల ప్రదేశాల్లోని యుటిలిటీలను షిఫ్ట్ చేయాలన్నారు. వచ్చే గురువారం ఇదే అంశంపై సమగ్ర కార్యాచరణ సిద్ధం చేసి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వాలని ఆదేశించారు. 

అనంతరం ట్రాఫిక్ అడిషనల్ కమిషనర్ విశ్వప్రసాద్, ఇంజనీరింగ్ అధికారులతో కలిసి దానకిశోర్, ఇలంబరితి బంజారాహిల్స్ లోని విరించి జంక్షన్, పెన్షన్ ఆఫీస్ రోడ్డును పరిశీలించారు. ఈ జంక్షన్​లో ట్రాఫిక్ సమస్యకు చెక్ పెట్టేందుకు పనులు చేపట్టాలని దానకిశోర్ ఆదేశించారు. నిధులు మంజూరు చేసినట్లు తెలిపారు.

పెన్షన్ ఆఫీస్  వద్ద  బల్కాపూర్ నాలాపై సిమెంట్ బ్రిడ్జి నిర్మించి రోడ్డు నెంబర్ –12కు అనుసంధానం చేయడంతోపాటు విరించి జంక్షన్ పై ట్రాఫిక్ భారం తగ్గించేందుకు లింక్ రోడ్ల నిర్మాణం సాధ్యాసాధ్యాలపై చర్చించారు. దానకిశోర్ వెంట జీహెచ్ఎంసీ మెయింటెనెన్స్ చీఫ్ ఇంజనీర్ భాస్కర్ రెడ్డి, జోనల్ ఎస్ఈ రత్నాకర్ తదితరులు పాల్గొన్నారు.