
ముషీరాబాద్, వెలుగు: ఆర్యవైశ్యులు రాజకీయంగా రాణించాల్సిన అవసరం ఉందని మాజీ మంత్రి, బీజేపీ నాయకుడు టీజీ వెంకటేశ్ అన్నారు. ఆదివారం ముషీరాబాద్‌లోని ఆర్య వైశ్య హాస్టల్ ఆవరణలో వాసవి ఆర్య వైశ్య హాస్టల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో లేడీస్ హాస్టల్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ముఖ్య అతిథిగా టీజీ వెంకటేశ్, ఆర్యవైశ్య హాస్టల్ ట్రస్ట్ చైర్మన్ గంజి రాజమౌళి గుప్తా, రాష్ట్ర పర్యాటక శాఖ కార్పొరేషన్ మాజీ చైర్మన్ ఉప్పల శ్రీనివాస్ గుప్తాతో కలిసి హాస్టల్ నిర్మాణ పనులను ప్రారంభించారు.
అనంతరం టీజీ వెంకటేశ్ మాట్లాడుతూ.. పేద కుటుంబాలకు చెందిన ఆర్యవైశ్యులతో పాటు ఇతర కులాలకు చెందిన విద్యార్థులు ఉన్నత చదువులు చదువుకునేందుకు ఈ హాస్టల్స్ ఎంతో సహకరిస్తున్నాయన్నారు. కొత్త హాస్టల్ నిర్మాణానికి టీజీ వెంకటేశ్ రూ. 50 లక్షల ఆర్థిక సాయం అందించారు. కార్యక్రమంలో గెల్లి రమేశ్, ప్రభాకర్, రమేశ్ రామ్, శ్రీనివాస్ గుప్తా, కాచం కృష్ణమూర్తి గుప్తా, శ్రీనివాస్ గుప్తా, రవి రాజు తదితరులు పాల్గొన్నారు.