లిక్కర్ రాణి.. తెలంగాణ తల్లి గురించి మాట్లాడటం విడ్డూరం: ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య

లిక్కర్ రాణి.. తెలంగాణ తల్లి గురించి మాట్లాడటం విడ్డూరం: ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య

హైదరాబాద్, వెలుగు: లిక్కర్ రాణి కవిత కూడా తెలంగాణ తల్లి విగ్రహం గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉందని ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య అన్నారు. అమెరికా నుంచి వచ్చిన కవిత.. తెలంగాణ తల్లి విగ్రహం ఆమె లెక్క ఉండాలని అనుకుంటుందని ఎద్దేవా చేశారు. 

మంగళవారం సీఎల్పీలో ఆయన మీడియాతో మాట్లాడారు. ‘‘తెలంగాణ తల్లి విగ్రహం గురించి  కేటీఆర్, హరీశ్​రావు మాట్లాడితే తెలంగాణ ప్రజలు నాలుక కోస్తరు జాగ్రత్త’’ అని హెచ్చరించారు. బీఆర్ఎస్ పదేండ్లు అధికారంలో ఉండి.. తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఎందుకు ప్రతిష్టించలేదని ఆయన ప్రశ్నించారు. తెలంగాణ తల్లి విగ్రహాన్ని చూస్తే చాకలి ఐలమ్మ, ఇతర ఉద్యమకారులు, పేదోళ్లు గుర్తొస్తారన్నారు. 

కవిత మహిళల గురించి ఇప్పుడు మాట్లాడుతోందని.. మహిళా గవర్నర్ ను దూషించిన ఘనత బీఆర్ఎస్ దని ఆయన గుర్తుచేశారు. ఆర్టీసీ బస్సుల్లో డ్యాన్స్ చేయమని మహిళల గురించి కేటీఆర్ చులకనగా మాట్లాడారన్నారు. కవులు, మేధావులతో చర్చించిన తర్వాతే సెక్రటేరియెట్ లో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించినట్టు ఐలయ్య చెప్పారు. 

గడీల తల్లి కాదు.. గరీబోళ్ల తల్లి కావాలని సీఎం  రేవంత్ రెడ్డి తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఇలా రూపకల్పన చేశారన్నారు. తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణకు రావాలని కేసీఆర్ ను మంత్రి పొన్నం ప్రభాకర్ ఆహ్వానిస్తే రాలేదన్నారు. అధికారంలోకి వచ్చాక తెలంగాణ తల్లి విగ్రహాన్ని గాంధీ భవన్  కు తరలిస్తామని కేటీఆర్ అంటున్నారని, ఆయన అలా మాట్లాడానికి సిగ్గుండాలన్నారు.