టెన్షన్ వద్దు..మేమున్నాం.. ఒత్తిడికి గురవుతున్నపిల్లలకు ఫ్రీ కౌన్సెలింగ్

టెన్షన్ వద్దు..మేమున్నాం.. ఒత్తిడికి గురవుతున్నపిల్లలకు ఫ్రీ కౌన్సెలింగ్
  • పరీక్షల భయంతో ఆందోళన చెందుతున్న స్టూడెంట్లకు టెలిమానస్ భరోసా
  • 14416 నంబర్​కు రోజూ 300 వరకు కాల్స్
  • పరీక్షల ముందు 800 వరకు పెరిగే చాన్స్​
  • 24 గంటల పాటు అందుబాటులో కౌన్సెలర్లు

హైదరాబాద్ సిటీ, వెలుగు: పరీక్షలు సమీపిస్తున్న కొద్దీ పిల్లల్లో టెన్షన్​ ఎక్కువవుతూ ఉంటుంది. చదివింది గుర్తుంటుందా? సరిగ్గా రాస్తామా? పాస్​ అవుతామా? మంచి ర్యాంకు వస్తుందా? రాకపోతే అమ్మానాన్న ఏమంటారో! అని తీవ్ర ఆందోళనకు గురవుతుంటారు. ప్రధానంగా టెన్త్, ఇంటర్  స్టూడెంట్లలో ఈ భయం ఎక్కువగా ఉంటుంది.  పోటీ ప్రపంచంలో ఒకవైపు ర్యాంకులు, మార్కులు రావాలని టీచర్ల ఒత్తిడి, మరోవైపు తల్లిదండ్రుల ఒత్తిడి మధ్య విద్యార్థులు నలిగిపోతుంటారు. ఈ బాధను ఎవరికి​చెప్పుకోవాలో తెలియక సతమతమవుతుంటారు. ఇలాంటి సందర్భంలోనే కొంతమంది ఆత్మహత్య లాంటి నిర్ణయాలు కూడా తీసుకుంటారు. 

అయితే, పిల్లల్లో ఒత్తిడిని​ తగ్గించడానికి ‘మీకు మేమున్నాం’ అంటూ అభయహస్తం అందిస్తున్నారు టెలీమానస్​ కౌన్సెలర్లు. పరీక్షల భయం, ఒత్తిడి, ఆందోళన, జ్ఞాపకశక్తి, చదువుకు సంబంధించిన ఏ సమస్య ఉన్నా టోఫ్రీ నంబర్​14416/1800–891–4416 కు కాల్​ చేస్తే చక్కని సలహా ఇచ్చి వారి సమస్యను పరిష్కరిస్తున్నారు. ప్రస్తుతం కాల్ సెంటర్ కు రోజూ 300 వరకు కాల్స్ ​వస్తున్నాయి. దీనికి తగ్గట్టే 24 గంటల పాటు కౌన్సెలర్లు అందుబాటులో ఉండి వారిలో భయాన్ని, ఒత్తిడిని పోగొడుతున్నారు. 

20 మంది కౌన్సెలర్లు 24 గంటలూ అందుబాటులో..
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా నిర్వహిస్తున్న టెలీమానస్ ​​టోల్​ ఫ్రీ కాలింగ్  సౌకర్యం 24 గంటల పాటు అందుబాటులో ఉంటుంది. 20 మంది కౌన్సెలర్లు, ఇద్దరు  సైకియాట్రిస్టులు, ఒక సైకాలజిస్ట్  ఎప్పుడూ అంటుబాటులో ఉంటారు. విద్యార్థుల పరిస్థితిని బట్టి వీరు కౌన్సెలింగ్  ఇస్తారు. కాల్  చేసిన వారి వివరాలను గోప్యంగా ఉంచుతారు. పరీక్షల సీజన్  కావడంతో రోజూ 300 వరకు కాల్స్ ​వస్తున్నాయని అధికారులు తెలిపారు. 

ఏటా ఫిబ్రవరి మొదటి వారంలో  కాల్స్ పెరుగుతాయని, క్రమంగా ఈ సంఖ్య రోజూ 800 నుంచి 900 వరకు ఉంటుందని చెప్పారు. ప్రస్తుతం స్కూళ్లలో పిల్లలకు రివిజన్, ఇంటర్​ స్టూడెంట్లకు ప్రాక్టికల్స్ జరుగుతున్నాయి. మార్చిలో పరీక్షలు జరగనున్న నేపథ్యంలో పిల్లలు, పెద్దలు టెలిమానస్  సేవలను వినియోగించుకుంటున్నారు. 

పిల్లల మీద ఆంక్షలు సరికాదు
పరీక్షల సీజన్  రాగానే తల్లిదండ్రులు పిల్లలను రిస్ట్రిక్ట్​ చేస్తారు. అయితే, అలా చేయడం కరెక్ట్​ కాదంటున్నారు టెలీమానస్ ​కౌన్సెలర్లు. ‘‘ఇది చేయడం కరెక్ట్​ కాదు. అది చేయడం కరెక్ట్​ కాదని పిల్లల మీద ఆంక్షలు పెట్టకూడదు. సడన్​గా ఆటలు బంద్​ చేయించరాదు. కొంతమంది పేరెంట్స్​ అప్పటి వరకు పిల్లలు వాడుతున్న మొబైల్​ను మొత్తానికి వాడకుండా చేస్తారు. దానివల్ల వాళ్లు డిస్టర్బ్ అయ్యే అవకాశం ఉంటుంది. అప్పుడప్పుడు పిల్లలను ఆటలకు పంపాలి. 

మొబైల్​ కూడా పరిమిత సమయం వరకు కాల్స్  మాట్లాడుకోవడానికి ఇవ్వాలి. కానీ, సోషల్ మీడియా, టీవీకి కచ్చితంగా దూరంగా ఉంచాలి. ఇవన్నీ ఒకేసారి చేయకుండా క్రమంగా దూరం చేయాలి” అని కౌన్సెలర్లు సూచించారు. ఇక, పిల్లలు డిప్రెషన్​కు లోనుకారని, డిప్రెషన్ వేరు.. మూడీగా ఉండడం వేరని కౌన్సెలర్లు తెలిపారు. పిల్లలపై చదువు ఒత్తిడి పెరగడం వల్ల మూడీగా ఉంటారని, ఈ సమయంలో వారికి చదువుకునేందుకు మంచి వాతావరణం ఉండేలా చూడాలన్నారు. 

ప్రశాంత వాతావరణం ఉండేలా చూడాలి
పిల్లలు కొత్త విషయాలు నేర్చుకోవడానికి ఎప్పుడూ ఆసక్తి చూపుతారు. వారికి చదువన్నా, పరీక్షలన్నా భయముండదు. స్కూళ్లలో టీచర్లు, ఇంట్లో పేరెంట్స్​ వారిలో ఆ భయాన్ని క్రియేట్​ చేస్తారు. 1 నుంచి 9 వ తరగతి దాకా ఎలాంటి భయం లేకుండా పాస్​ అయిన పిల్లలు టెన్త్ లోనే ఎందుకు ఫెయిల్  అవుతున్నారు? టీచర్లు, పేరెంట్స్ టెన్త్, ఇంటర్​  ఎగ్జామ్స్​  కష్టంగా ఉంటాయని అనవసరపు భయాన్ని సృష్టించడమే దీనికి కారణం. దీంతో వారు టెన్షన్​తో సరిగ్గా ప్రిపేర్​ కాలేరు. సాధ్యమైనంత వరకు పేరెంట్స్, టీచర్లు పిల్లలను చదువు చదువు అంటూ పట్టుకుని ఉండొద్దు. అలాగని పూర్తిగా వదిలేయకూడదు. వాళ్లకు చదువుకునే ప్రశాంత వాతావరణాన్ని క్రియేట్  చేయాలి.


జవహర్​ లాల్ నెహ్రూ, సీనియర్​ సైకాలజిస్ట్, టెలీమానస్