
హైదరాబాద్, వెలుగు: నిబంధనలకు విరుద్ధంగా విద్యార్థుల సర్టిఫికెట్లను కాలేజీలలో పెట్టుకుంటున్న మేనేజ్మెంట్లపై చర్యలు తీసుకోవడానికి తెలంగాణ హయ్యర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ (టీజీసీహెచ్ఈ) రెడీ అయింది. సర్టిఫికెట్లు ఇవ్వకుండా స్టూడెంట్లను వేధిస్తున్న కాలేజీలకు నోటీసులు ఇవ్వాలని నిర్ణయించింది. ప్రధానంగా ఈ సమస్య ఇంజినీరింగ్, ఫార్మసీ, ఎంబీఏ, ఎంసీఏ, లా తదితర కాలేజీల్లో ఎక్కువగా ఉంటోంది.
ఈ క్రమంలో మేనేజ్మెంట్ల నుంచి స్పందన రాకుంటే వెంటనే కౌన్సిల్‌కు వారంతా ఫిర్యాదులు చేస్తున్నారు. మధ్యలో చదువులు మానేసిన వారికి... మొత్తం కోర్సు పూర్తయ్యే వరకూ అదనంగా 2,3 ఏండ్ల ఫీజులు చెల్లించాలని మేనేజ్మెంట్లు స్టూడెంట్లను ఇబ్బందులకు గురి చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో అలాంటి కాలేజీలన్నింటికీ ఏఐసీటీఈ, యూజీసీ నిబంధనల ప్రకారం ఆయా కాలేజీలపై ఎందుకు చర్యలు తీసుకోకూడదో చెప్పాలని మేనేజ్మెంట్లకు నోటీసులు ఇవ్వనున్నది. వారిచ్చే రిప్లై ఆధారంగా చర్యలు తీసుకుంటామని హయ్యర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ సెక్రటరీ శ్రీరామ్ వెంకటేశ్ తెలిపారు.