హైదరాబాద్, వెలుగు: ప్రభుత్వ హాస్పిటళ్లలో పనిచేస్తున్న డాక్టర్ల సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తామని గవర్నమెంట్ డాక్టర్స్ అసోసియేషన్(టీజీడీఏ) ప్రెసిడెంట్ నరహరి, జనరల్ సెక్రటరీ లాలూ ప్రసాద్ తెలిపారు. ఈ మేరకు అసోసియేషన్ ఎన్నికల తర్వాత బుధవారం సెంట్రల్ ఎగ్జిక్యూటివ్ కమిటీ తొలి సమావేశాన్ని స్టేట్ ఆఫీసులో నిర్వహించారు.
ఈ సమావేశంలో అసోసియేషన్ ట్రెజరర్ రవూఫ్, సెంట్రల్ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నరహరి, లాలూ మాట్లాడుతూ.. డాక్టర్ల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తామని తెలిపారు. వీవీపీ, డీఎంఈ డాక్టర్లను ఆయుష్మాన్ మందిరాలలో ఓపీ చూడడానికి పంపించడాన్ని తాము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని చెప్పారు. ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని పేర్కొన్నారు. త్వరలోనే అసోసియేషన్ సభ్యత్వ నమోదు ప్రక్రియను ప్రారంభిస్తామన్నారు.