
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో ఇంజినీరింగ్, ఫార్మసీ, అగ్రికల్చర్ కోర్సుల్లో అడ్మిషన్ల కోసం నిర్వహించే టీజీ ఎప్ సెట్ ఎగ్జామ్స్ మంగళవారం నుంచి ప్రారంభం అవుతున్నాయి. ఈ పరీక్షలకు నిమిషం నిబంధన అమల్లో ఉంది. నిమిషం లేటైనా పరీక్షా కేంద్రాల్లోకి అనుమతించరు. కాగా.. మంగళవారం, బుధవారం అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ స్ర్టీమ్ విద్యార్థులకు.. మే 2, 3, 4వ తేదీల్లో ఇంజినీరింగ్ స్ర్టీమ్ విద్యార్థులకు పరీక్షలు నిర్వహించనున్నారు.
అయితే.. ఈఏపీ సెట్ కు 3,06,796 దరఖాస్తులు రాగా, ఇంజినీరింగ్ స్ర్టీమ్ లో 2,20,049, అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ స్ర్టీమ్ లో 86,493, రెండింటికీ 254 అప్లికేషన్లు వచ్చాయి. అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ కోసం 112, ఇంజినీరింగ్ స్ర్టీమ్ కోసం 124 ఆన్ లైన్ పరీక్షా కేంద్రాలను అధికారులు ఏర్పాటు చేశారు.ఉదయం 9 నుంచి మధ్యాహ్నం12 గంటల వరకు ఫస్ట్ సెషన్, మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 6 గంటల వరకూ సెకండ్ సెషన్ లో ఎగ్జామ్స్ జరగనున్నాయి.
హాల్ టికెట్లపై ముద్రించిన క్యూఆర్ కోడ్ ఆధారంగా అభ్యర్థులు నిర్ణీత టైమ్‌కు కనీసం గంటర్నర ముందు పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలని ఈఏపీసెట్ కో కన్వీనర్ ప్రొఫెసర్ విజయ్ కుమార్ రెడ్డి తెలిపారు. అభ్యర్థులకు ఎలాంటి అసౌకర్యాలు కలుగుకుండా అన్ని జాగ్రత్తలు తీసుకున్నామని ఆయన ఓ ప్రకటనలో పేర్కొన్నారు.