ఫార్మా సిటీ భూముల చుట్టూ ఫెన్సింగ్‌‌..అడ్డుకున్న రైతులు

ఫార్మా సిటీ భూముల చుట్టూ ఫెన్సింగ్‌‌..అడ్డుకున్న రైతులు
  • నష్టపరిహారం తీసుకున్న రైతుల భూములకే కంచె వేస్తున్నామన్న ఆఫీసర్లు

ఇబ్రహీంపట్నం, వెలుగు : గ్రీన్​ఫార్మాసిటీ కోసం గత ప్రభుత్వ హయాంలో సేకరించిన భూమిలో టీజీఐఐసీ కంచెలను ఏర్పాటు చేస్తోంది. ఫార్మా సిటీ కోసం గత ప్రభుత్వం మేడిపల్లిలో 2,264 ఎకరాల పట్టా భూములు, 1,984 ఎకరాల ప్రభుత్వ భూమిని సేకరించింది. ఇందులో పూర్తి పరిహారం అందిన రైతులకు సంబంధించిన భూముల్లో ఫెన్సింగ్‌‌ ఏర్పాటుకు చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా గురువారం ఉదయం భారీ పోలీస్‌‌ బందోబస్తు మధ్య రెవెన్యూ, టీజీఐఐసీ ఆఫీసర్లు మేడిపల్లికి వచ్చి కంచె ఏర్పాటు పనులు ప్రారంభించారు.

అయితే కొందరు రైతులు వచ్చి తాము నష్టపరిహారం తీసుకోలేదని, తమకు ఇచ్చిన ప్లాట్‌‌ పొజిషన్‌‌ చూపించకుండా తమ భూముల్లోకి రావొద్దని ఇబ్రహీంపట్నం ఆర్డీవో అనంతరెడ్డి, యాచారం తహసీల్దార్​అయ్యప్ప, టీజీఐఐసీ ఆఫీసర్లను నిలదీశారు. దీంతో కొంత ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. అక్కడే ఉన్న మహేశ్వరం అడిషనల్‌‌ డీసీపీ సత్యనారాయణ, ఇబ్రహీంపట్నం ఏసీపీ రాజు, సీఐలు రైతులను అదుపులోకి తీసుకున్నారు. తర్వాత సుమారు ఐదు కిలోమీటర్ల మేర హద్దులు ఏర్పాటు చేశారు.