
- టీజీఎన్‌పీడీసీఎల్ సీఎండీ వరుణ్‌రెడ్డి
- హనుమకొండ కలెక్టరేట్‌లో బహిరంగ విచారణ
- హాజరైన ఈఆర్సీ చైర్మన్ జస్టిస్ దేవరాజు నాగార్జున్
హనుమకొండ, వెలుగు : టీజీఎన్‌పీడీసీఎల్ పరిధిలో 2025 – 26 ఆర్థిక సంవత్సరానికి టారిఫ్ పెంపుదల ప్రతిపాదనలు ఏమీ లేవని, కరెంట్ చార్జీల్లో ఎలాంటి మార్పు ఉండదని సంస్థ సీఎండీ కర్నాటి వరుణ్‌రెడ్డి స్పష్టం చేశారు. టైం ఆఫ్ డే (టీవోడీ) ధరల్లో ఎలాంటి మార్పు లేదని, గ్రీన్ ఎనర్జీని ఎంచుకునే ఎల్‌టీ, హెచ్‌టీ వినియోగదారులకు మాత్రం సాధారణ టారిఫ్ కంటే యూనిట్‌కు రూ.0.66 గ్రీన్ టారిఫ్ విధింపు ఉంటుందన్నారు. ఓపెన్ యాక్సెస్ ఎనర్జీ మేరకు వినియోగదారులకు వర్తించే ఎనర్జీ చార్జీలో 10 శాతం చొప్పున స్టాండ్‌బై చార్జీల విధింపు కొనసాగిస్తున్నట్లు తెలిపారు.
టీజీఎన్‌పీడీసీఎల్ 2025– 26 సవరించిన ఆదాయ ఆవశ్యకత, రిటైల్ సరఫరా ధరలు, క్రాస్ సబ్సిడీ సర్ చార్జీల ప్రపోజల్స్‌పై టీజీ ఈఆర్సీ చైర్మన్ జస్టిస్ దేవరాజు నాగార్జున్ అధ్యక్షతన బుధవారం హనుమకొండ కలెక్టరేట్‌లో బహిరంగ విచారణ చేపట్టారు. ఈ సందర్భంగా సీఎండీ వరుణ్‌రెడ్డి మాట్లాడుతూ నాణ్యమైన విద్యుత్ అందించేందుకు చేపడుతున్న అభివృద్ధి పనులు, సమ్మర్ యాక్షన్ ప్లాన్, ఇతర సమగ్ర సమాచారాన్ని వివరించారు.
అనంతరం వివిధ జిల్లాల నుంచి వచ్చిన భారతీయ కిసాన్ సంఘ్ నేతలు, రైతులు, వినియోగదారులు తమ సమస్యలను ఈఆర్సీ చైర్మన్ నాగార్జున్ దృష్టికి తీసుకెళ్లారు. అనంతరం కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండలం చందాపూర్‌కు చెందిన మౌనిక భర్త కరెంట్ షాక్‌తో చనిపోవడంతో ఆమెకు రూ. 5 లక్షల చెక్ అందజేశారు.
సమస్యలను క్షేత్రస్థాయిలోనే పరిష్కరించాలి : ఈఆర్సీ చైర్మన్ జస్టిస్ దేవరాజు నాగార్జున్
విద్యుత్ సంబంధ సమస్యలను ఆఫీసర్లు, సిబ్బంది క్షేత్రస్థాయిలోనే పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని టీజీఈఆర్సీ చైర్మన్ దేవరాజు నాగార్జున్ సూచించారు. గ్రామాల్లో సమావేశాలు నిర్వహించి రైతులు, వినియోగదారుల సమస్యలను పరిష్కరించాలని, ఈ మేరకు ఒక రోజు ముందుగా గ్రామస్తులకు సమాచారం ఇవ్వాలని సూచించారు. వ్యవసాయ కనెక్షన్లతో పాటు పరిహారం చెల్లింపులపై ఆఫీసర్లు దృష్టి పెట్టాలన్నారు. ప్రమాదాల నివారణపై వినియోగదారులకు చైతన్యం కలిగించే చర్యలు చేపట్టాలని సూచించారు.