
హనుమకొండ, వెలుగు: ఈదురు గాలులు, భారీ వర్షాలున్నాయనే వాతావరణశాఖ హెచ్చరికల నేపథ్యంలో ఎన్పీడీసీఎల్ పరిధిలోని ఎలక్ట్రిసిటీ ఆఫీసర్లు, సిబ్బంది అలర్ట్ గా ఉండాలని సీఎండీ కర్నాటి వరుణ్రెడ్డి ఆదేశించారు. బుధవారం హనుమకొండ నక్కలగుట్టలోని విద్యుత్ భవన్ నుంచి ఎస్ఈలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి మాట్లాడారు.
ఎక్కడైనా చెట్లు విరిగి, లైన్లు తెగిపడి ట్రిప్పింగ్స్, బ్రేక్ డౌన్స్ అయితే వెంటనే పునరుద్ధరించాలని సూచించారు. ఆ సమాచారాన్ని ఎప్పటికప్పడు సర్కిల్ కంట్రోల్ రూమ్ కు చేరవేయాలని, అక్కడ్నుంచి కార్పొరేట్ ఆఫీస్ కు అందించాలని వివరించారు.
క్షేత్రస్థాయిలో విద్యుత్ అందుబాటులో ఉండాలని, ప్లాన్ ప్రకారం పనులు చేపట్టాలని పేర్కొన్నారు. ఖమ్మం, భద్రాద్రి, ఆదిలాబాద్, మంచిర్యాల, ఆసిఫాబాద్, భూపాలపల్లి, మహబూబాబాద్, వరంగల్, జగిత్యాల, పెద్దపల్లి జిల్లాల్లో భారీ వర్షాలు పడే చాన్స్ ఉందని, అంతరాయం కలిగితే ప్రత్యామ్నాయ మార్గాల్లో సరఫరా చేయాలని తెలిపారు. టోల్ ఫ్రీ 1912 కి ఫోన్ చేసేలా ప్రతి సర్కిల్ లో ప్రచారం చేయాలని ఆఫీసర్లకు సూచించారు. ఇన్చార్జ్ డైరెక్టర్ టి.మధుసూదన్, సీఈలు రాజుచౌహాన్, అశోక్ , 16 సర్కిళ్ల ఎస్ఈలు ఉన్నారు.