కరెంట్ కట్ లేకుండా..సమ్మర్​ యాక్షన్​ ప్లాన్​...వేసవి నేపథ్యంలో డిమాండ్ ను బట్టి ఎన్పీడీసీఎల్ చర్యలు

కరెంట్ కట్ లేకుండా..సమ్మర్​ యాక్షన్​ ప్లాన్​...వేసవి నేపథ్యంలో డిమాండ్ ను బట్టి ఎన్పీడీసీఎల్ చర్యలు

ఇబ్బందులు రాకుండా 16 సర్కిళ్లలో రూ.600 కోట్లతో పనుల ప్లాన్ 
ఎక్కడైనా సమస్య తలెత్తినా వెంటనే సాల్వ్ చేసేలా రెడీ

హనుమకొండ, వెలుగు: వేసవి నేపథ్యంలో విద్యుత్​ వాడకం పెరుగుతోంది. వచ్చే మూడు నెలల పాటు మరింత పెరిగే అవకాశం ఉంది. దీంతో  అంతరాయం లేకుండా కరెంట్​సరఫరా చేయాలనే లక్ష్యంగా తెలంగాణ నార్తర్న్​ పవర్​ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్(టీజీఎన్​పీడీసీఎల్) ​రెడీ అయింది.  సంస్థ పరిధిలోని 16 సర్కిళ్లలో దాదాపు రూ.600 కోట్లతో ‘ సమ్మర్ ​యాక్షన్ ​ప్లాన్​’ చేపట్టింది.  

రికార్డు స్థాయిలో కరెంట్ వాడకం

టీజీఎన్​పీడీసీఎల్ పరిధిలో కరీంనగర్, జగిత్యాల, పెద్దపల్లి, నిజామాబాద్​, కామారెడ్డి, ఆదిలాబాద్​, నిర్మల్​, మంచిర్యాల, ఆసిఫాబాద్​, హనుమకొండ, వరంగల్, జనగామ, జయశంకర్​, మహబూబాబాద్​, ఖమ్మం, భద్రాద్రి జిల్లాలు ఉన్నాయి. డొమెస్టిక్​, కమర్షియల్, ఇండస్ట్రియల్​ ఇలా అన్నీ కలిపి దాదాపు రూ.68.34 లక్షలు, వ్యవసాయానికి  రూ.12.2 లక్షలకు పైగా విద్యుత్  కనెక్షన్లు ఉన్నాయి.

రోజుకు సగటున 4 వేల మెగావాట్ల విద్యుత్ డిమాండ్ ఉంటుండగా..  వేసవిలో మరింతగా పెరుగుతోంది. రాష్ట్రంలో గత నెల 5న తొలిసారి 15,752 మెగావాట్ల రికార్డు స్థాయి డిమాండ్ ఏర్పడింది. ఎన్​పీడీసీఎల్​పరిధిలో 5,328 మెగావాట్లుగా నమోదైంది. ఎన్​పీడీసీఎల్​ పరిధిలో సగటున 5,600 వరకు డిమాండ్​ ఉంటోంది. యాసంగిలో పంటల సాగు కారణంగా మార్చి, ఏప్రిల్​లో 17వేల మెగావాట్లకు చేరుతుందని ఆఫీసర్లు అంచనా వేశారు. 

రూ.600 కోట్లతో పనులు షురూ

టీజీఎన్పీడీసీఎల్​పరిధిలో సాధారణ రోజుల్లో సగటున 4వేల మెగావాట్ల వరకు కరెంట్ డిమాండ్ నమోదవుతోంది. మార్చి, ఏప్రిల్, మే కూడా డిమాండ్​ మరింత పెరిగే చాన్స్ ఉంది. దీంతో టీజీ ఎన్పీడీసీఎల్ ముందస్తు యాక్షన్ ప్లాన్ చేపట్టింది. రూ.600 కోట్ల అంచనాతో పనులకు శ్రీకారం చుట్టింది. 16 సర్కిళ్ల పరిధిలో దాదాపు రూ.150 కోట్లతో కొత్త సబ్​ స్టేషన్లతో పాటు పాత సబ్​స్టేషన్ల పునరుద్ధరణ, రూ.150 కోట్లతో కొత్త ఫీడర్స్ పనులను అధికారులు చేపట్టారు.

క్షేత్రస్థాయిలో ఓవర్​లోడ్​ట్రాన్స్​ఫార్మర్లపై భారం తగ్గించేలా సుమారు రూ.190 కోట్లతో కొత్తగా 3,954 డిస్ట్రిబ్యూషన్​ ట్రాన్స్​ఫార్మర్లు(డీటీఆర్​), 105 పవర్​ట్రాన్స్​ఫార్మర్లు(పీటీఆర్​) ఏర్పాటు చేస్తున్నారు. వీటితో పాటు 33కేవీ లైన్లు, 11కేవీ లైన్లు ఇంటర్​లింకింగ్ పనులు కూడా పూర్తి చేశారు. 

ప్రతి పోల్ కు జియో ట్యాగింగ్

వేసవిలో ఎక్కడైనా విద్యుత్  సమస్యలు ఏర్పడితే వెంటనే సాల్వ్ ​చేసేలా.. ప్రతి పోల్​కు  యూనిక్​నంబరింగ్ ఇచ్చి, అస్సెట్​ మ్యాపింగ్​లో భాగంగా జియో ట్యాగింగ్ చేస్తున్నారు. ఇప్పటికే  33కేవీ, 11 కేవీ అన్నీ కలిపి 7,367 ఫీడర్లలో చేపట్టగా.. మార్చిలోపు ప్రక్రియ పూర్తి చేస్తామని అధికారులు చెబుతున్నారు.  ఎక్కడైనా సమస్యలు తలెత్తితే ఆ పోల్​నంబర్ ను ట్రేస్​ చేసి వెంటనే వెళ్లి తగిన చర్యలు తీసుకునే చాన్స్ ఉంటుందని పేర్కొంటున్నారు.

త్వరగా వెళ్లేందుకు జీపీఆర్ఎస్ ​సిస్టంతో ఎమర్జెన్సీ రీస్టోర్ ​టీమ్(ఈఆర్టీ) వెహికల్స్ ​కూడా అందుబాటులో ఉంచుతున్నారు. సబ్​స్టేషన్ల రియల్​టైమ్ మానిటరింగ్​సబ్​ స్టేషన్లలో సమస్యలను ఐడెంటీఫై చేసేలా రియల్​ టైమ్ డేటా మానిటరింగ్​ సిస్టం ఏర్పాటు చేస్తున్నారు. తొలి దశలో 100 సబ్​ స్టేషన్లు గుర్తించి, ఈరోజు నుంచి పనులు ప్రారంభిస్తున్నారు.

ఆసిఫాబాద్​ సర్కిల్‌లో 19, ములుగు డివిజన్​ లో 18, ఖమ్మం రూరల్​లో 24, వైరాలో14, కాటారం సబ్​ డివిజన్​ లో 10, గ్రేటర్​ వరంగల్ పరిధిలో 15 సబ్​ స్టేషన్లలో  ఏర్పాటు చేస్తున్నారు.  తద్వారా  వోల్టేజ్ లో హెచ్చుతగ్గులు, ఇతర లోపాలు తలెత్తినా వెంటనే కిందిస్థాయి నుంచి పైస్థాయి వరకు అలర్ట్​ మెసేజ్​వెళ్తుంది.  అక్కడి సమస్యలను మానిటరింగ్ చేయొచ్చని ఆఫీసర్లు పేర్కొంటున్నారు. సమ్మర్​లో విద్యుత్  సరఫరాలో ఎలాంటి సమస్యలు వచ్చినా 1912 టోల్​ ఫ్రీ నంబర్ కాల్​చేస్తే వెంటనే యాక్షన్​చేపట్టేలా చర్యలు తీసుకుంటామని చెబుతున్నారు.

అంతరాయాలు రాకుండా విద్యుత్ సరఫరా చేస్తాం.

ఎన్​పీడీసీఎల్​ పరిధిలో వ్యవసాయ పనులతో మార్చిలోనే ఎక్కువ డిమాండ్​ వచ్చే చాన్స్ ఉంటుంది. ఏప్రిల్​, మే లో పట్టణాల్లో డిమాండ్​పెరుగుతుంది. ఎంత ఉన్నా అంతరాయం లేకుండా నాణ్యమైన విద్యుత్ ను సరఫరా చేస్తాం. సబ్​ స్టేషన్లలో రియల్​టైం డేటా మానిటరింగ్​ సిస్టంను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తాం. నిరంతరం విద్యుత్ అందించేందుకు సమ్మర్​యాక్షన్​ప్లాన్​ మేరకు తగు చర్యలు తీసుకుంటాం. -కర్నాటి వరుణ్​రెడ్డి, సీఎండీ, టీజీఎన్​పీడీసీఎల్