
- డైరీ ఆవిష్కరణలో టీజీవో నేతలు
తిమ్మాపూర్, వెలుగు: పెండింగ్‌లో ఉన్న బిల్లులను విడుదల చేస్తే మూడు కాదు 24గంటలూ పనిచేస్తామని, ఆ దిశగా ప్రభుత్వం ఆలోచన చేయాలని టీజీవో రాష్ట్ర అధ్యక్షుడు ఏలూరి శ్రీనివాస్ అన్నారు. తిమ్మాపూర్ మండల కేంద్రంలోని ఈఎన్సీ కార్యాలయంలో టీజీవో డైరీ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి కలెక్టర్ పమేలా సత్పతి హాజరయ్యారు.
ప్రభుత్వంలో కీలకమైన సమస్యలు మంత్రి సీతక్క చొరవతో పరిష్కారం అవుతున్నాయని, అయితే ఆర్థికపరమైన బిల్లులు చాలా పెండింగ్‌లో ఉన్నాయన్నారు. ఉచితాల కోసం జీతాన్ని ఫణంగా పెట్టడం సరికాదనీ, సమస్యలు పరిష్కారం కాకుంటే ఉద్యమ కార్యాచరణకైనా సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ టీఎన్జీవో, టీజీవోలతో కలిసి పనిచేయడం సంతోషంగా ఉందన్నారు.
గత ఎన్నికలు సజావుగా నిర్వహించడంలో వారి పాత్ర కీలకమని కొనియాడారు. ప్రభుత్వ ఉద్యోగులంటే ప్రజల్లో ఉన్న చులకనభావాన్ని తొలగించేలా పనిచేయాలన్నారు. అడిషనల్ కలెక్టర్ ప్రఫుల్ దేశాయ్, టీఎన్జీవో రాష్ట్ర అధ్యక్షుడు మారం జగదీశ్వర్, జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్‌రెడ్డి, టీజీవో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సత్యనారాయణ, జిల్లా అధ్యక్షుడు కాళీచరణ్, తదితరులు పాల్గొన్నారు.