ఉద్యోగులపై దాడులు చేస్తే ఊరుకోం: టీజీవో

ఉద్యోగులపై దాడులు చేస్తే ఊరుకోం: టీజీవో
  • ప్రత్యక్ష ఆందోళనలకు దిగుతాం: టీజీవో కేంద్ర సంఘం  
  • పెండింగ్ డీఏలు రిలీజ్ చేయాలి
  • ఈహెచ్ఎస్ పై ఉత్తర్వులు ఇవ్వాలి
  • రిటైర్డ్ ఉద్యోగులు, ఆఫీసర్లను తీసుకోవద్దని ప్రభుత్వానికి విజ్ఞప్తి   

హైదరాబాద్, వెలుగు:  వికారాబాద్‌‌ జిల్లా లగచర్ల, నిర్మల్‌‌ జిల్లా దిలావర్‌‌ పూర్‌‌ ఘటనల్లో జిల్లా కలెక్టర్‌‌, డివిజన్, మండల అధికారులపై దాడులను తీవ్రంగా ఖండిస్తున్నామని తెలంగాణ గెజిటెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్ (టీజీవో) కేంద్ర సంఘం తెలిపింది. ఉద్యోగులు, అధికారులపై మళ్లీ ఇలాంటి దాడులు చేస్తే ఊరుకోబోమని.. ప్రత్యక్ష ఆందోళనలకు దిగుతామని హెచ్చరించింది. ఈ దాడులు చాలా బాధాకరమని, ఈ ఘటనలు జరిగినప్పటి నుంచి అధికారులు, ఉద్యోగులు భయంతో విధులు నిర్వర్తిస్తున్నారని టీజీవో అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఏలూరి శ్రీనివాసరావు, సత్యనారాయణ తెలిపారు. శనివారం నాంపల్లి టీజీవో భవన్ లో టీజీవో రాష్ర్ట కార్యవర్గ సమావేశం జరిగింది. 33 జిల్లాల నేతలు,సెక్రటేరియెట్, 76 శాఖలు, ఫోరమ్స్ నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉద్యోగుల సమస్యలపై పలు నిర్ణయాలు తీసుకొని, తీర్మానాలను ఆమోదించారు. 

వీటిని త్వరలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆధ్వర్యంలో కేబినెట్ సబ్ కమిటీకి, సీఎస్ శాంతి కుమారికి అందజేస్తామని నేతలు తెలిపారు. ఉద్యోగులకు పెండింగ్ లో ఉన్న 4 డీఏలు రిలీజ్ చేయాలని, ఉద్యోగుల కాంట్రిబ్యూషన్ తో ఈహెచ్ఎస్ ట్రస్ట్ ను ఏర్పాటు చేయాలని నేతలు డిమాండ్ చేశారు. కొత్త జిల్లాలకు క్యాడర్ స్ర్టెంత్ శాంక్షన్ చేయాలని, 317 జీవోతో నష్టపోయిన ఉద్యోగులకు న్యాయం చేయాలని, ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి రాష్ర్ట, జిల్లా స్థాయిలో జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ ఏర్పాటు చేయాలన్నారు. పీఆర్సీ కమిషన్ రిపోర్ట్ తెప్పించుకొని పీఆర్సీని ప్రకటించాలన్నారు. అన్ని శాఖల్లో రిటైర్ అయిన అధికారులను తిరిగి కన్సల్టెంట్లుగా తీసుకోవద్దని ప్రభుత్వాన్ని నేతలు కోరారు.