- మార్చి నెలాఖరులోగా అన్ని పరీక్షల ఫలితాలు
- ఇకపై రిజల్ట్స్ కోసం ఏండ్ల తరబడి ఎదురుచూడక్కర్లేదని వెల్లడి
హైదరాబాద్, వెలుగు : రాష్ట్రంలో మే1 నుంచి కొత్త ఉద్యోగాలకు నోటిఫికేషన్లు జారీ చేయనున్నట్టు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీజీపీఎస్సీ) చైర్మన్ బుర్రా వెంకటేశం తెలిపారు. ఇక నుంచి ప్రతి సంవత్సరం ఖాళీలను భర్తీ చేస్తామన్నారు. మార్చి 31 వరకు అన్ని శాఖల నుంచి ఖాళీల వివరాలు సేకరిస్తామని చెప్పారు. ఇదే విషయమై సర్కారుకు లేఖ రాయనున్నట్టు వెల్లడించారు. ఏప్రిల్ నెలలో రోస్టర్ పాయింట్లను పరిశీలించి, మే నెలలో నోటిఫికేషన్లు ఇస్తామని చెప్పారు. రెండు రోజుల్లో గ్రూప్ 2 ప్రిలిమినరీ కీని రిలీజ్ చేస్తామని తెలిపారు.
మంగళవారం టీజీపీఎస్సీ ఆఫీసులో బుర్రా వెంకటేశం మాట్లాడారు. ప్రస్తుతం ఉన్న పెండింగ్ నోటిఫికేషన్ల ప్రక్రియను త్వరలోనే పూర్తిచేస్తామని, ఆ తర్వాతే నోటిఫికేషన్లు ఇస్తామని తెలిపారు. ఏ నోటిఫికేషన్ ఇచ్చినా మూడు నెలల నుంచి ఏడాదిలోపే ప్రక్రియను కంప్లీట్ చేస్తామని టీజీపీఎస్సీ చైర్మన్ బూర్ర వెంకటేశం చెప్పారు. గ్రూప్స్ ఎగ్జామ్స్ ఆరు నెలల నుంచి ఏడాది వరకు.. చిన్నచిన్న ఎగ్జామ్స్ అయితే నెల నుంచి మూడు నెలల్లోనే ఫలితాలు ఇస్తామని చెప్పారు. ఇక నుంచి ఫలితాల కోసం అభ్యర్థులు ఏండ్లకు ఏండ్లు ఎదురు చూడాల్సిన అవసరం ఉండదన్నారు.
బోర్డులోని ఖాళీలను నింపుతం
ప్రశ్నపత్రాల లీకేజీ కాకుండా, పేపర్ సెట్టింగ్ ఎవరికీ తెలియకుండా జాగ్రత్తలు తీసుకుంటామన్నారు. లీకేజీకి అవకాశం లేకుండా పరీక్షకు ఒకరోజు ముందు ప్రశ్నపత్రాలను సెట్ చేసేలా క్వశ్చన్ బ్యాంక్ సిద్ధం చేయాలనే ఆలోచనలో ఉన్నట్టు పేర్కొన్నారు. టీజీపీఎస్సీ కార్యాలయంలో సిబ్బంది కొరత ఉందని, ఇటీవలే ప్రభుత్వం పలు పోస్టులను మంజూరు చేసిందన్నారు. కొత్తవాళ్లు వచ్చేదాకా 87 మందిని డిప్యూటేషన్ పై తీసుకుంటున్నామని చెప్పారు. దీనికోసం సుమారు 600 దరఖాస్తులు వచ్చాయని, సంక్రాంతి నాటికి వారిని నియమించుకుంటామని వెల్లడించారు.
Also Read :- అనుమతులు లేకుండా, నీటి వాటాలు తేలకుండా ఎట్ల కడ్తరు?
ఉద్యోగ పరీక్షల నియామకాల ప్రక్రియను పరిశీలించేందుకు ఇటీవలే ఢిల్లీలోని యూపీఎస్సీ, ఎస్ ఎస్ సీ వెళ్లి పరిశీలించి వచ్చామని తెలిపారు. యూపీఎస్సీలో ఇంటర్వ్యూ ఆధారంగా సెలెక్షన్స్ ఉంటాయని, ఎస్ఎస్సీలో ఇంటర్వ్యూ లేదని, పరీక్షల ఆధారంగానే నియామకాలు ఉంటాయని వివరించారు. ఈ నెల11, 12న బెంగుళూరులో నేషనల్ లెవల్ లో అన్ని రాష్ట్రాల పబ్లిక్ సర్వీస్ కమిషన్ల ఆలిండియా కాన్ఫరెన్స్ ఉందని, తద్వారా వివిధ రాష్ట్రాల్లో అమలు చేస్తున్న విధానాలు తెలుసుకునే అవకాశం ఏర్పడిందని చెప్పారు.
సర్టిఫికెట్ల వెరిఫికేషన్ ఆయా శాఖలు చూసుకుంటే బాగుంటుంది
ప్రిలిమినరీ కీ, పైనల్ కీ లాంటి వాటిపై పునరాలోచన చేస్తున్నట్టు బూర్ర వెంకటేశం చెప్పారు. యూపీఎస్సీ ఏనాడూ కీలను రిలీజ్ చేయదన్నారు. పరీక్ష పెట్టిన వారిపై నమ్మకం లేకపోతే ఎలా అని ప్రశ్నించారు. సర్టిఫికెట్ల వెరిఫికేషన్ ప్రక్రియను ఉద్యోగం వచ్చాక ఆయా శాఖలు చూసుకునేలా ఉంటే బాగుంటుందని ఆయన తెలిపారు. సిలబస్ తగ్గింపు, గ్రూప్స్ 2, 3లో పరీక్షల సంఖ్య తగ్గింపుపై ఆలోచన చేస్తామన్నారు. ఇటీవల గ్రూప్స్ పరీక్షల్లో ఏపీకి చెందిన అంశాలు ఎక్కువగా రావడానికి ఆ పేపర్ లో ఉన్న సిలబసే కారణమని వివరించారు.