
- ఉద్యోగ పరీక్షలన్నీ స్పీడప్ చేస్తం: బుర్రా వెంకటేశం
- కమిషన్‌పై విశ్వాసం పెరిగేలా పనిచేస్తానని వెల్లడి
- టీజీపీఎస్సీ చైర్మన్‌గా బాధ్యతల స్వీకరణ
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో ఉద్యోగ అర్హత పరీక్షలు ఇకనుంచి షెడ్యూల్ ప్రకారమే జరుగుతాయని టీజీపీఎస్సీ చైర్మన్ బుర్రా వెంకటేశం తెలిపారు. అన్ని పరీక్షలను స్పీడప్ చేస్తామని చెప్పారు. పరీక్షలు ప్రతిసారీ వాయిదా పడుతాయని, ఎప్పుడు జరుగుతాయో తెలియదనే కన్ఫ్యూజ్ ను అభ్యర్థులు తీసేయ్యాలని ఆయన సూచించారు. డీఎస్సీ 2024 ఫలితాలు కేవలం 60 రోజుల్లో ఇచ్చామని, టీజీపీఎస్సీ పరీక్షల రిజల్ట్స్ కూడా అనుకున్న టైమ్‌లోనే ఇస్తామని ఆయన స్పష్టం చేశారు. యూపీఎస్సీతో సమానంగా టీజీపీఎస్సీ పనిచేస్తుందని వెల్లడించారు. గురువారం తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ గా బుర్రా వెంకటేశం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా కమిషన్ సెక్రటరీ నవీన్ నికోలస్, టీజీపీఎస్సీ సభ్యులు అనితా రాజేంద్ర, యాదయ్య, అమీర్ ఉల్లాఖాన్, రామ్ మోహన్ రావు, పాల్వాయి రజిని తదితరులు ఆయనకు అభినందనలు తెలిపి సన్మానించారు. అనంతరం వెంకటేశం మీడియాతో మాట్లాడారు. కమిషన్‌పై అభ్యర్థులకు పూర్తి విశ్వాసం కలిగించడం తన బాధ్యత అని చెప్పారు. టీజీపీఎస్సీ చైర్మన్ గా ఈ పదవీలోకి రావడం సంతోషంగా ఉందన్నారు. రిక్రూట్మెంట్ ఏజెన్సీలు కరెక్ట్‌గా పనిచేయడం వల్లే తనకు ఉద్యోగం వచ్చిందని వెల్లడించారు. పరిచయం ఉన్న వారిని నమ్మడం మానేసి, తమపై నమ్మకంతో చదుకోవాలని ఆయన అభ్యర్థులకు సూచించారు. భయంతో పరీక్షలు రాయడం మానేసి ధైర్యంగా రాయాలన్నారు.
నిరుద్యోగ అభ్యర్థులకు న్యాయం చేయాలనే..
నిరుద్యోగ అభ్యర్థులకు న్యాయం చేయాలనే ఉద్దేశంతోనే మూడున్నరేండ్ల సర్వీస్ ను వదులుకొని.. టీజీపీఎస్సీ చైర్మన్ గా వచ్చినట్టు వెంకటేశం వెల్లడించారు. టీజీపీఎస్సీపై మరింత నమ్మకం కలిగేలా పనిచేస్తానని చెప్పారు. ఎవరైనా టీజీపీఎస్సీలో తెలుసు.. ఉద్యోగం ఇప్పిస్తాం అంటే వెంటనే పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయాలని అభ్యర్థులకు సూచించారు. అలాంటి వారిపై కఠినంగా ఉంటామని, ఎవరినీ వదిలిపెట్టబోమని, ఎవరైనా ఇలాంటి తప్పులు చేసిన వాళ్లు ఉంటే వెంటనే తప్పుకోవాలని హెచ్చరించారు. తెలంగాణలో మరిన్ని ఉద్యోగులు కల్పించేలా పనిచేస్తానన్నారు.
త్వరలో ప్రత్యేక టోల్ ఫ్రీ నంబర్, ఈ-మెయిల్..
త్వరలోనే అభ్యర్థుల ఫిర్యాదుల కోసం ప్రత్యేకంగా టోల్ ఫ్రీ నంబర్ తో పాటు మెయిల్ ఐడీని ప్రకటిస్తామని వెంకటేశం తెలిపారు. ఈ మెయిల్స్‌ను కేవలం చైర్మన్, సెక్రటరీ మాత్రమే ఓపెన్ చేస్తామని, ఆయా సమస్యలను వెంటనే పరిష్కరించేందుకు కృషి చేస్తామని చెప్పారు. పరీక్షల్లో తప్పులు రాకుండా చూసుకుంటామన్నారు. ఫలానా బుక్ చదవాలని తాము ఎవరికీ చెప్పబోమన్నారు. త్వరలోనే యూపీఎస్సీకి వెళ్లి అక్కడి విధివిధానాలపై అధ్యయనం చేస్తానన్నారు. యూపీఎస్సీపై అభ్యర్థులకు ఎలాంటి నమ్మకం ఉందో.. అలాగే టీజీపీఎస్సీనీ తయారుచేస్తామని చైర్మన్ ధీమా వ్యక్తం చేశారు.
ఉద్యోగాలిస్తామంటే మెసేజ్ చేయండి
డబ్బులిస్తే ఉద్యోగాలు ఇప్పిస్తామని ఎవరైనా సంప్రదిస్తే నమ్మొద్దని అభ్యర్థులకు టీజీపీఎస్సీ సెక్రటరీ నవీన్ నికోలస్ స్పష్టం చేశారు. అలాంటి వారిని గుర్తించి వెంటనే కమిషన్ విజిలెన్స్ సెల్ మొబైల్ నంబర్ కు 99667 00339 మెసేజ్ చేయాలని సూచించారు. లేదంటే సాక్షాధారాలతో vigilance@tspsc.gov.in మెయిల్ చేయాలని కోరారు. తద్వారా వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.
బుర్రా వెంకటేశంను సన్మానించిన గవర్నర్
టీజీపీఎస్సీ చైర్మన్ బుర్రా వెంకటేశంను రాజ్ భవన్ లో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ సన్మానించారు. ఈ కార్యక్రమానికి గవర్నర్ ప్రిన్సిపల్ సెక్రటరీ దానకిషోర్, గవర్నర్ జాయింట్ సెక్రటరీ భవానీ శంకర్ తో పాటు రాజ్ భవన్ అధికారులు, సిబ్బంది అటెండ్ అయ్యారు. గవర్నర్ ప్రిన్సిపల్ సెక్రటరీగా ఇటీవలి వరకు విధులు నిర్వర్తించిన బుర్రా వెంకటేశం.. వీఆర్ఎస్ తీసుకొని టీజీపీఎస్సీ చైర్మన్ గా నియమితులయ్యారు. వెంకటేశం తన దగ్గర ప్రిన్సిపల్ సెక్రటరీగా 9 నెలల పాటు ఎంతో డెడికేషన్ తో పనిచేశారని గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ కొనియాడారు.