
టీజీపీఎస్సీ చైర్మన్ బుర్రా వెంకటేశం
హైదరాబాద్, వెలుగు: రిక్రూట్మెంట్ ప్రక్రియతో పాటు టెక్నాలజీ అమలులో ఎదురవుతున్న సమస్యల పరిష్కారానికి జూన్‌లో హైదరాబాద్ లో జాతీయ స్థాయి వర్క్ షాప్ నిర్వహిస్తున్నామని తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీజీపీఎస్సీ) చైర్మన్ బుర్రా వెంకటేశం తెలిపారు. నల్సార్ లా యూనివర్సిటీ ప్రొఫెసర్ల సహకారంతో లీగల్ ఇష్యూస్‌పై అవగాహన కల్పించేందుకు చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. కేరళలోని తిరువనంతపురంలో రెండు రోజులుగా జరుగుతున్న రిక్రూట్మెంట్లో టెక్నాలజీపై నేషనల్ వర్క్ షాప్ ఆదివారం ముగిసింది. ఈ కార్యక్రమానికి చైర్మన్ బుర్రా వెంకటేశంతో పాటు సభ్యులు యాదయ్య, రజిని హాజరయ్యారు. దేశవ్యాప్తంగా 19 రాష్ట్రాల పబ్లిక్ సర్వీస్ కమిషన్ల చైర్ పర్సన్లు సహా 60 మంది ప్రతినిధులు అటెండ్ అయ్యారు.
ఈ సందర్భంగా వెంకటేశం మాట్లాడారు. టీజీపీఎస్సీ సబ్జెక్టుల వారీగా నేషనల్ లెవెల్ సబ్జెక్ట్ ఎక్స్ పర్ట్ వివరాలను రెడీ చేస్తున్నట్టు చెప్పారు. జూన్ నాటికి ఎంప్యానెల్డ్ డైరెక్టరీని అందరికీ అందుబాటులోకి తీసుకొస్తామని వివరించారు. ఈ ఏడాదిలో రెండు కీలకమైన సమావేశాలను తెలంగాణ నిర్వహించనున్నట్టు తెలిపారు. జూన్ లో లీగల్ ఇష్యూస్ పై వర్క్ షాప్ నిర్వహిస్తున్నామని, డిసెంబర్లో దేశవ్యాప్తంగా పీఎస్సీల బలోపేతంపై నేషనల్ వర్క్ షాప్ ఉంటుందని చెప్పారు. పరీక్షల నిర్వహణలో డిజిటల్ వ్యాల్యూయేషన్ ప్రక్రియ కీలకమన్నారు. ఉద్యోగ నియామక ప్రక్రియలో అభ్యర్థుల గుర్తింపు కోసం ఆధార్, డాక్యుమెంట్ వెరిఫికేషన్ కోసం డీజీ లాకర్ డేటా, భద్రత కోసం బ్లాక్ చెయిన్ టెక్నాలజీ, ఏఐ తదితర వాటిని వినియోగించుకోవచ్చని చెప్పారు.