యునైటెడ్ నేషన్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ (యూఎన్డీపీ) బ్రేకింగ్ ది గ్రిడ్ లాక్ : రీ ఇమేజినింగ్ కో ఆపరేషన్ ఇన్ ఏ పోలరైజ్డ్ వరల్డ్ థీమ్‌తో మానవాభివృద్ధి సూచీ(హెచ్‌డీఐ)ను విడుదల చేసింది. 193 దేశాల జాబితాలో భారత్ 134వ ర్యాంకు సాధించింది. స్విట్జర్లాండ్ మొదటి స్థానంలో నిలిచింది.
మానవాభివృద్ధిని వివిధ కోణాల్లో అంచనా వేస్తూ 1990 నుంచి యూఎన్డీపీ మానవాభివృద్ధి నివేదికలను విడుదల చేస్తోంది. 4 సూచికల్లో ప్రగతి ఆధారంగా మానవాభివృద్ధి నివేదిక అంచనా వేస్తోంది.
అవి..
1. ఆయుర్ధాయం (సుస్థిరాభివృద్ధి లక్ష్యం–3)
2. ఎక్స్పెక్టెడ్ ఇయర్స్ ఆఫ్ స్కూలింగ్ (ఎస్డీజీ –4.3)
3. మీన్ ఇయర్స్ ఆఫ్ స్కూలింగ్ (ఎస్డీజీ–4.4)
4. గ్రాస్ నేషనల్ ఇన్కమ్ (ఎస్డీజీ 8.5)
మూడు కేటరీలుగా విభజన
1 నుంచి 69 ర్యాంకులు పొందిన దేశాలను చాలా ఎక్కువ మానవాభివృద్ధి సూచీ కలిగిన కేటగిరీలోనూ 70–115 ర్యాంకుల దేశాలను ఎక్కువ హెచ్‌డీఐ దేశాల కేటగిరీలోనూ 116–159 ర్యాంకుల దేశాలను మధ్యస్థ కేటగిరీలోనూ 160–193 ర్యాంకుల దేశాలను అల్ప హెచ్‌డీఐ దేశాల కేటగిరీల్లోనూ చేర్చారు. సూచీలో ఆస్ట్రేలియా పదో ర్యాంకు (సూచీ విలువ 0.946) యూకే 15వ ర్యాంకు (0.940), యూఎస్ఏ 20వ ర్యాంకు (0.927), జపాన్ 24వ ర్యాంకు(0.920), ఫ్రాన్స్ 28వ ర్యాంకు (0.910), ఇటలీ 30వ ర్యాంకు (0.906)లు సాధించాయి.
భారత్ పొరుగు దేశాల ర్యాంకులు
బంగ్లాదేశ్ 129వ ర్యాంకు, భూటాన్ 125వ ర్యాంకు, శ్రీలంక 79వ ర్యాంకు, చైనా 75వ ర్యాంకు సాధించాయి. గత సూచీతో పోల్చితే ఈసారి చైనా మూడు ర్యాంకులు మెరుగుపరుచుకోగా.. శ్రీలంక ఆర్థిక సంక్షోభం కారణంగా అయిదు స్థానాలను కోల్పోయింది. పాకిస్తాన్ 0.540 సూచీ విలువతో 164వ స్థానంలో నిలిచింది.
సూచికల్లో భారత్ పురోగతి
మానవాభివృద్ధి సూచీని రూపొందించేందుకు యూఎన్డీపీ పరిగణనలోకి తీసుకుంటున్న వివిధ అంశాల్లో భారత్ పురోగతి కనబరిచింది. ప్రజల సగటు ఆయుర్దాయం 2022లో 67.7 ఏళ్లు కాగా, ఇది అంతకుముందు ఏడాది 67.2 ఏళ్లుగా నమోదైంది. దేశ తలసరి స్థూల జాతీయాదాయం (జీఎన్ఐ) 12 నెలల కాలంలో 6.3 శాతం మేరకు పెరిగి 6951 అమెరికన్ డాలర్లకు పెరిగింది. ఎక్స్పెక్టెడ్ ఇయర్స్ ఆఫ్ స్కూలింగ్ 12.6 సంవత్సరాలు, మీన్ ఇయర్స్ ఆఫ్ స్కూలింగ్ 6.6 సంవత్సరాలుగా నమోదైంది. తాజా మానవాభివృద్ధి సూచీలో భారత్ మధ్యస్థ మానవాభివృద్ధి కేటగిరీలో నిలిచింది.
లింగ అసమానత సూచీలో 0.437 విలువతో భారత్ 108వ స్థానంలో నిలిచింది. పునరుత్పత్తి ఆరోగ్యం, సాధికారత, శ్రామిక శక్తిలో భాగస్వామ్యం తదితరాల ఆధారంగా ఈ సూచీని రూపొందించారు. మధ్యస్థ మానవాభివృద్ధి కేటగిరీలోని దేశాలు లేదా దక్షిణాసియా దేశాలతో పోల్చుకుంటే పునరుత్పత్తి ఆరోగ్య విషయంలో భారత్ మెరుగ్గా ఉంది. 2020లో దేశంలో ప్రతి లక్ష సజీవ జననాలకు 103 మాతృమరణాలు నమోదు కాగా, కౌమార జనన రేటు 2021లో 17.1 కాగా, ఇది 2022 నాటికి కొంత మెరుగుపడి 16.3కు చేరింది.
అభివృద్ధికి కొలమానం
ప్రపంచంలో అభివృద్ధి చెందిన, చెందుతున్న దేశాలు తమ అభివృద్ధికి కొలమానంగా 1990 నుంచి మానవా భివృద్ధి సూచీని ఉపయోగిస్తున్నాయి. కాలానుగుణంగా సూచిక అంశాలు, లెక్కింపు విధానంలో మార్పులు చెందుతు న్నాయి. ఐక్యరాజ్య సమితి అనుబంధ సంస్థ యూఎన్డీపీ 1990 నుంచి ఏటా మానవాభివృద్ధి నివేదికలో ఈ సూచికను తెలుపుతుంది. దీర్ఘాయుష్షు, ఆరోగ్యకర జీవితం, విద్య, జీవన ప్రమాణాలు తదితర మూడు మౌలిక అంశాల ఆధారంగా మానవాభివృద్ధిని అంచనా వేస్తున్నారు.
పాకిస్తాన్‌కు చెందిన ఆర్థిక వేత్త మహబూబ్ ఉల్ హక్ సూచన మేరకు మానవాభివృద్ధికి ప్రధానమైన మూడు అంశాలను పరిగణనలోకి తీసుకొని 1990లో మొదటిసారి 130 దేశాల గణాంకాల సహాయంతో ర్యాంకులను కేటాయించారు. ఇప్పుడు తాజాగా 193 దేశాలకు యూఎన్డీపీ ర్యాంకులను కేటాయించింది. తాజా నివేదికలో స్విట్జర్లాండ్ మొదటి ర్యాంకు సాధించగా, సోమాలియా 193వ స్థానంలో నిలిచింది. కొరియా (డెమోక్రటిక్ పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ కొరియా), మొనాకో దేశాలకు ఈసారి ర్యాంకులు కేటాయించలేదు.