- 23,999 మంది ఎంపిక.. 13 నుంచి వెబ్ ఆప్షన్లు
హైదరాబాద్, వెలుగు: గ్రూప్ 4 అభ్యర్థుల షార్ట్ లిస్టును టీజీపీఎస్సీ ఆదివారం రిలీజ్ చేసింది. రాష్ట్రవ్యాప్తంగా 23,999 మందిని ఎంపిక చేసింది. ఈ నెల13 నుంచి వెబ్ ఆప్షన్లు ఇచ్చుకునేందుకు అవకాశం కల్పించింది. సర్టిఫికెట్ వెరిఫికేషన్ కు రాష్ట్రంలో రెండు సెంటర్లను ఏర్పాటు చేసినట్టు కమిషన్ ప్రకటించింది. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కార్యాలయంతో పాటు నాంపల్లిలోని పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీలో రెండు కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపింది. అభ్యర్థులు సర్టిఫికెట్ వెరిఫికేషన్ కు కావాల్సిన డాక్యుమెంట్లను సిద్ధం చేసుకోవాలని సూచించింది.
హాల్ టికెట్, టెన్త్ మెమో, స్టడీ సర్టిఫికెట్లు, డిగ్రీ, పీజీ ఉంటే సంబంధించిన ప్రొవిజినల్ సర్టిఫికెట్లు, క్యాస్ట్, బీసీ క్రిమిలేయర్, ఈడబ్ల్యూఎస్, వయో పరిమితి మినహాయింపునకు సంబంధించిన సర్టిఫికెట్లతో పాటు దివ్యాంగులైతే ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ సర్టిఫికెట్, మూడు పాస్ ఫొటోలు సిద్ధం చేసుకోవాలని చెప్పింది. కాగా, 8,180 గ్రూప్- 4 పోస్టుల భర్తీకి పోయినేడాది జులైలో పరీక్ష నిర్వహించారు. దీనికి 9,51,205 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా.. 7,61,198 మంది హాజరయ్యారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో ఫలితాలు విడుదల చేశారు.