వారంలో క్షమాపణ చెప్పాలి..లేదంటే పరువు నష్టం దావా వేస్తాం: టీజీపీఎస్సీ

వారంలో క్షమాపణ చెప్పాలి..లేదంటే పరువు నష్టం దావా వేస్తాం: టీజీపీఎస్సీ
  • గ్రూప్ 1 వ్యాఖ్యలపై బీఆర్ఎస్ నేత రాకేశ్ రెడ్డికి నోటీసులు

హైదరాబాద్, వెలుగు: గ్రూప్ 1 పరీక్షలు, ఫలితాలపై బీఆర్ఎస్ నేత ఏనుగుల రాకేశ్ రెడ్డి నిరాధారమైన ఆరోపణలు చేశారని టీజీపీఎస్సీ మండిపడింది. పేరు ప్రతిష్టలకు భంగం కలిగించేలా వ్యాఖ్యానించారని ఫైర్ అయింది. ఎలాంటి ఆధారాలు లేకుండానే కేవలం 10 నుంచి 15 సెంటర్లలోని వారికే టాప్ మార్కులు వచ్చాయన్నారని, అది కమిషన్ విశ్వసనీయతను దెబ్బతీస్తుందని పేర్కొన్నారు. రాకేశ్ రెడ్డికి టీజీపీఎస్సీ సెక్రటరీ సుమతి శనివారం పరువు నష్టం నోటీసులు పంపించారు.

వారం రోజుల్లో సమాధానం ఇవ్వాలని, క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. మరోసారి ఇలాంటి తప్పుడు వ్యాఖ్యలు చేయబోనని రాతపూర్వక హామీ ఇవ్వాలని కోరారు. లేదంటే సివిల్, క్రిమినల్ డిఫేమేషన్​ కేసు వేస్తామని హెచ్చరించారు. తెలంగాణ ప్రజలకు సేవ చేసేందుకు కమిట్​మెంట్​తో టీజీపీఎస్సీ పనిచేస్తున్నదని స్పష్టం చేశారు. సమయానికి రిక్రూట్​మెంట్లను చేపట్టేలా టీజీపీఎస్సీ స్టాఫ్ రాత్రింబవళ్లు కష్టపడుతున్నారని చెప్పారు.

నిరుద్యోగులకు న్యాయబద్ధంగా రిక్రూట్​మెంట్లు చేపడ్తున్నామన్నారు. మీ ఆన్​లైన్ ప్రెజెన్స్​ను పెంచుకునేందుకు, నలుగురి దృష్టిలో పడేందుకే ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సరికాదని మండిపడ్డారు. కాగా, టీజీపీఎస్సీ నోటీసులపై హరీశ్ రావు స్పందించారు. ఇది కచ్చితంగా రాజకీయ కక్షసాధింపు చర్యలేనని విమర్శించారు. ‘‘గ్రూప్ 1 అభ్యర్థుల తరఫున అన్యాయాన్ని ప్రశ్నిస్తే పరువు నష్టం దావా వేస్తారా? ప్రజా ప్రభుత్వం అంటూనే నియంతృత్వ పాలనను కొనసాగిస్తారా? క్రిమినల్ కేసులు అంటూ బెదిరిస్తారా?’’అని నిలదీశారు.