16 నుంచి గ్రూప్ 1 సర్టిఫికెట్ల వెరిఫికేషన్

16 నుంచి గ్రూప్ 1 సర్టిఫికెట్ల వెరిఫికేషన్
  • షెడ్యూల్ రిలీజ్ చేసిన టీజీపీఎస్సీ  

హైదరాబాద్, వెలుగు: గ్రూప్ 1 అభ్యర్థుల సర్టిఫికెట్ల వెరిఫికేషన్ కు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీజీపీఎస్సీ) షెడ్యూల్ రిలీజ్ చేసింది. గ్రూప్1 సర్వీసెస్​లో 563 పోస్టులకుగాను 1:1 రేషియోలో 563 మంది అభ్యర్థులతో షార్ట్ లిస్టును కమిషన్ అధికారిక వెబ్ సైట్ https://www.tspsc.gov.in లో పెట్టింది. వీరికి నాంపల్లిలోని సురవరం ప్రతాపరెడ్డి తెలుగు యూనివర్సిటీలో వెరిఫికేషన్ చేపట్టనున్నారు. ఈ మేరకు టీజీపీఎస్సీ సెక్రటరీ నవీన్ నికోలస్ బుధవారం ఒక ప్రకటన రిలీజ్ చేశారు. ఈ నెల16, 17, 19, 21 తేదీల్లో ప్రతిరోజూ ఉదయం 10:30 నుంచి సాయంత్రం5:30 వరకు ఈ ప్రక్రియ కొనసాగనుంది. అయితే, అభ్యర్థుల్లో ఎవరైనా వివిధ కారణాలతో ఆయా తేదీల్లో ఆబ్సెంట్ అయినట్టయితే.. వారికి సర్టిఫికెట్ల వెరిఫికేషన్ కోసం ఈ నెల 22న రిజర్వ్ డేను కూడా కేటాయించారు. 

వెరిఫికేషన్ కు అభ్యర్థులు తమ ఒరిజినల్ సర్టిఫికెట్లతో పాటు రెండు సెట్ల జిరాక్స్ కాపీలను తీసుకురావాలని ప్రకటనలో పేర్కొన్నారు. అభ్యర్థులకు కేటాయించిన తేదీల్లో వెరిఫికేషన్ కు హాజరవ్వాలని.. లేదంటే రిజర్వ్ డే రోజు అయినా ఒరిజినల్ సర్టిఫికెట్లు తెచ్చి వెరిఫికేషన్ చేయించుకోవాలని తెలిపారు. రిజర్వ్ డే రోజు కూడా వెరిఫికేషన్ కు హాజరు కాని అభ్యర్థులకు మరో అవకాశం ఇవ్వబోమని స్పష్టం చేశారు. 

సర్టిఫికెట్ల వెరిఫికేషన్ కోసం ఈ నెల 15 నుంచి 22వ తేదీ వరకు టీజీపీఎస్సీ వెబ్ సైట్ ద్వారా వెబ్ ఆప్షన్లు ఇచ్చుకోవాల్సి ఉంటుంది. వెరిఫికేషన్ కు జాబితాలోని అభ్యర్థులను వరుసగా పిలుస్తారు. ఎవరైనా గైర్హాజరైతే, లిస్టులో ఆ తర్వాత ఉన్న వారి సర్టిఫికెట్లను వెరిఫై చేస్తారు. కాగా, డీఎస్పీ, అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ అభ్యర్థులను వెబ్ ఆప్షన్ల ప్రకారం.. మెడికల్ టెస్టులకు కూడా పంపించనున్నారు.