
- పదేండ్లు అయిన నేపథ్యంలో సిలబస్‌లో మార్పులకు కసరత్తు
హైదరాబాద్, వెలుగు: తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్(టీజీపీఎస్సీ) ఆధ్వర్యంలో నిర్వహించే పలు పోటీ పరీక్షల కోసం కొత్త సిలబస్ తయారు చేయనున్నారు. దీనికోసం సిలబస్ కమిటీ చైర్మన్‌గా హయ్యర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ చైర్మన్ ప్రొఫెసర్ బాలకిష్టారెడ్డిని నియమించారు. బుధవారం ఎంసీహెచ్ఆర్డీలో టీజీపీఎస్సీ ఆధ్వర్యంలో పలు అంశాలపై చర్చించేందుకు వర్సిటీ వీసీలతో సమావేశం జరిగింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన వెంటనే 2014–15లో టీఎస్పీఎస్సీ కోసం అప్పట్లో ప్రొఫెసర్ కోదండరామ్ నేతృత్వంలో సిలబస్ కమిటీని నియమించారు. కమిటీలో సీనియర్ విద్యావేత్తలు చుక్కా రామయ్య, హరగోపాల్ తదితరులు ఉన్నారు. సిలబస్ వచ్చి పదేండ్లు అవుతున్న నేపథ్యంలో ప్రస్తుతం వచ్చిన మార్పులకు అనుగుణంగా సిలబస్ లో మార్పులు తీసుకురావాలని కమిషన్ డిసైడ్ అయింది.
దీనికోసం బాలకిష్టారెడ్డి నేతృత్వంలో ఆరుగురు సభ్యులతో కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ ప్రస్తుతమున్న గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4తో పాటు ఇతర పరీక్షల సిలబస్‌ను రూపొందించనున్నారు. సమకాలీన అవసరాలు, రాష్ట్ర విధానాలు, జాతీయ పోటీ పరీక్షల ప్రమాణాలను పరిగణనలోకి తీసుకొని కొత్త సిలబస్ తయారు చేయనున్నారు. ఉద్యోగ అవసరాలు, అభ్యర్థుల సామర్థ్యాలను అంచనా వేసేలా దీన్ని రూపొందించనున్నారు. దీంతో పాటు పటిష్టమైన క్వశ్చన్ బ్యాంక్ రూపకల్పన, ఇంటర్వ్యూలపై అధ్యయనం, టెక్నికల్ అంశాలపై మరో మూడు కమిటీలనూ టీజీపీఎస్సీ వేసింది. వీటికి జేఎన్టీయూ వీసీ, పాలమూరు వర్సిటీ వీసీ బాధ్యులుగా ఉన్నారు.