- కాలం చెల్లిన బస్సుల స్థానంలో కొత్తవి
- ఇప్పటికే అందుబాటులో 115 ఎలక్ట్రిక్ బస్సులు
- జేబీఎస్లో రన్నింగ్‌లో ఉన్న చార్జింగ్ స్టేషన్
- సీబీఎస్‌లో మరొకటి నిర్మాణం
- పర్యావరణ హితం, ఖర్చు తక్కువ కావడంతో ఆర్టీసీ చర్యలు
హైదరాబాద్‌సిటీ, వెలుగు: గ్రేటర్‌సిటీ పరిధిలో మరిన్ని ఎలక్ట్రిక్బస్సులు అందుబాటులోకి తెచ్చేందుకు టీజీ ఆర్టీసీ సిద్ధమవుతోంది. దేశంలోని ప్రధాన నగరాల్లో కాలుష్యం పెరిగిపోతున్న నేపథ్యంలో సీఎన్ జీ, ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని ప్రోత్సహించాలని కేంద్రం నిర్ణయించిన క్రమంలో అందుకు అనుగుణంగా ఆర్టీసీ చర్యలు తీసుకుంటోంది. పెద్ద సంఖ్యలో ఎలక్ట్రిక్బస్సులను ప్రవేశపెట్టేందుకు సన్నాహాలు చేస్తోంది. ప్రస్తుతం గ్రేటర్‌పరిధిలో ఆర్టీసీ 2,800 బస్సులు నడుపుతోంది. వీటిలో నాలుగైదు వందల బస్సులు మినహా మిగతావన్నీ డీజిల్వాహనాలే. వీటిలోనూ రెండు మూడేండ్లలో కాలం చెల్లబోయే బస్సులు చాలానే ఉన్నాయి. దీంతో కొత్త ఎలక్ట్రిక్బస్సులను కొనుగోలు చేయాలని ఆర్టీసీ ఆలోచిస్తోంది.
సరిపడా చార్జింగ్ స్టేషన్లు
ప్రస్తుతం గ్రేటర్‌పరిధిలో 115 ఎలక్ట్రిక్ నాన్ఏసీ బస్సులు వివిధ రూట్లలో నడుస్తున్నాయి. ఇందులో 49 బస్సులు ఎయిర్పోర్ట్ రూట్లోనే నడుస్తుండగా మిగిలిన వాటిని వివిధ రూట్లలో నడుపుతున్నారు.ఈ క్రమంలో త్వరలోనే మరో 400 ఎలక్ట్రిక్నాన్ఏసీ బస్సులను కొనబోతున్నట్టు గ్రేటర్హైదరాబాద్ జోన్ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. ఎలక్ట్రిక్బస్సుల సంఖ్యకు అనుగుణంగా చార్జింగ్చేసేందుకు నగరంలోని వివిధ ప్రాంతాల్లో చార్జింగ్ స్టేషన్లను కూడా నిర్మిస్తున్నట్టు తెలిపారు. ప్రస్తుతం జేబీఎస్లో ఒకటి రన్నింగ్‌లో ఉండగా, సీబీఎస్వద్ద మరో చార్జింగ్స్టేషన్ఏర్పాటు చేస్తున్నట్టు చెప్పారు. ఇలా దశల వారీగా కీలక బస్‌డిపోలు, స్టేషన్ల వద్ద కూడా చార్జింగ్ స్టేషన్లను నిర్మించాలని ప్రతిపాదనలు ఉన్నాయని అంటున్నారు.
మెయింటెనెన్స్ ఈజీ
పర్యావరణ హితం కావడం, కాలుష్యం లేకపోవడం, మెయింటనెన్స్ఈజీ కావడమే ఆర్టీసీ ఎలక్ట్రిక్బస్సుల వైపు మొగ్గు చూపడానికి కారణమని అధికారులు చెబుతున్నారు. డీజిల్, పెట్రోలుకు పెట్టే ఖర్చుతో పోలిస్తే ఎలక్ట్రిక్బస్సులకు 80 శాతమే వ్యయం అవుతుందని అంటున్నారు. ప్రస్తుతం ఎలక్ట్రిక్ బస్సులను ఆపరేట్‌చేసే బాధ్యతలను ఆర్టీసీ నిర్వహిస్తుందని, మెయింటెనెన్స్బాధ్యతలను ఓలెక్ట్రా అనే కంపెనీ నిర్వహిస్తోందని చెప్తున్నారు. వారికి మెయింటెనెన్స్కింద కిలోమీటర్ల వారీగా చెల్లింపులు జరుగుతాయన్నారు.