ఐటీ కారిడార్​లో ఆర్టీసీ సర్వే!

ఐటీ కారిడార్​లో ఆర్టీసీ సర్వే!
  •    ఫీడ్ బ్యాక్​ ఆధారంగా బస్సులు పెంచాలని నిర్ణయం
  •     ఏ ప్రాంతాల నుంచి ఎంత మంది వస్తున్నారనే దానిపై ఆరా
  •     అవసరమైన చోట బస్సులు సర్దుబాటు చేసే యోచన
  •     కొత్త బస్సుల్లో మెజారిటీ శాతం ఐటీ కారిడార్​కు తిప్పాలని ప్లాన్

హైదరాబాద్, వెలుగు: కొత్తగా తీసుకొస్తున్న బస్సులతో ఆదాయం పెంచుకోవాలని గ్రేటర్​ఆర్టీసీ ఆలోచిస్తోంది. ప్రయాణికుల రద్దీ ఉన్న ప్రాంతాల్లోనే ఎక్కువ బస్సులు తిప్పాలని చూస్తోంది. కొత్త బస్సుల్లో ఎక్కువ శాతం ఐటీ కారిడార్ రూట్లలో ప్రవేశ పెట్టాలని అధికారులు నిర్ణయించారు. ఐటీ కారిడార్ వైపు ఏ ఏ ప్రాంతాల నుంచి ఉద్యోగులు వస్తున్నారన్న విషయం తెలుసుకునేందుకు ప్రత్యేకంగా ఆన్​లైన్ సర్వే నిర్వహిస్తున్నారు. ఐటీ ఉద్యోగులు ఐదు నిమిషాల్లో తమ వివరాలు అందించేలా ఓ యాప్​ను సిద్ధం చేసి అందుబాటులో ఉంచారు. ఐటీ ఉద్యోగులు ఇచ్చే సమాచారం ఆధారంగా ఆర్టీసీ బస్సులను పెంచాలని చూస్తున్నారు. 

వారంలో ఎన్నిసార్లు?

ఐటీ కారిడార్​లోని వివిధ కంపెనీల్లో పనిచేస్తున్న ఉద్యోగులు ఆధారంగా సర్వే కొనసాగుతోంది. ఆర్టీసీ బస్సుల్లో ఎంత మంది ప్రయాణం చేస్తున్నారన్న వివరాలు రాబడుతున్నారు. ఏఏ ప్రాంతాల నుంచి ఉద్యోగులు వస్తున్నారు? వారంలో ఎన్నిసార్లు ఆఫీసుకు వచ్చి పోతున్నారనే విషయం తెలుసుకుంటున్నారు. ఏసీ బస్సులకు ప్రాధాన్యం ఇస్తున్నారా? లేక నాన్​ఏసీలకు ప్రాధాన్యం ఇస్తారా? అనే లెక్క తీస్తున్నారు. ఆర్టీసీ నుంచి ఎలాంటి సర్వీసులను కోరుకుంటున్నారో తెలుసుకుంటున్నారు. ఉద్యోగుల ఫీడ్​ బ్యాక్​ ఆధారంగా బస్సుల ఫ్రీక్వెన్సీని పెంచాలని ఆర్టీసీ అధికారులు నిర్ణయించారు. 

గోల్కొండ బోనాలకు ప్రత్యేక బస్సులు

ఇదిలా ఉండగా ఈ నెల 7వ తేదీ నుంచి ప్రారంభమయ్యే గోల్కొండ బోనాల ఉత్సవాల కోసం స్పెషల్​బస్సులు నడుపుతున్నట్లు గ్రేటర్​ హైదరాబాద్ ఆర్టీసీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్​ వెంకటేశ్వర్లు గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. సిటీలోని వివిధ ప్రాంతాల నుంచి గోల్కొండకు మొత్తం 75 స్పెషల్​బస్సులను ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. 

సికింద్రాబాద్​ రైల్వే స్టేషన్​ నుంచి 10, కాచిగూడ రైల్వేస్టేషన్​ నుంచి 5, సీబీఎస్​ నుంచి 5, పటాన్​చెరు నుంచి 5, ఈసీఐఎల్​క్రాస్​రోడ్స్​ నుంచి 5, మెహిదీపట్నం నుంచి 8, దిల్​సుఖ్​నగర్​నుంచి 4, హయత్​నగర్​ నుంచి 2, కూకట్​పల్లి నుంచి 2, రాజేంద్రనగర్​ నుంచి 4, రామ్​నగర్​ నుంచి 4, చార్మినార్​ నుంచి 6, ఉప్పల్​ నుంచి 4, కేపీహెచ్​బీ కాలనీ నుంచి 4,  ఓల్డ్ బోయిన్​పల్లి నుంచి 4, మల్కాజిగిరి నుంచి 4 బస్సులు ఏర్పాటు చేశామని వెల్లడించారు. సమాచారం కోసం ఎంజీబీఎస్, బర్కత్​పురా డీఎం నంబర్​90004 06069, మెహిదీపట్నం డీఎం నంబర్​99592 26133, గోల్కొండ డీఎం నంబర్ 99592 26131కు ఫోన్​చేయవచ్చన్నారు.