ఆర్టీసీలో ఎలక్ట్రిక్ సూపర్ లగ్జరీ బస్సులు

ఆర్టీసీలో ఎలక్ట్రిక్ సూపర్ లగ్జరీ బస్సులు
  • ఒక్కసారి చార్జింగ్ చేస్తే 325 కిలోమీటర్లు
  • రెండున్నర గంటల్లోనే బ్యాటరీ ఫుల్ చార్జ్
  • కరీంనగర్​లో 35 బస్సులు ప్రారంభించిన మంత్రి పొన్నం
  • దశలవారీగా ఆర్టీసీకి 2,400 ఎలక్ట్రిక్ బస్సులు

కరీంనగర్, వెలుగు: ఆర్టీసీలో తొలిసారిగా ఎలక్ట్రిక్ సూపర్ లగ్జరీ బస్సులు అందుబాటులోకి వచ్చాయి. కరీంనగర్ జిల్లా కేంద్రంలో 35 బస్సులను మంత్రి పొన్నం ప్రభాకర్ ఆదివారం ప్రారంభించారు. 41 సీట్లతో కూడిన ఈ బస్సును 2.30 గంటలు ఫుల్ చార్జింగ్ చేస్తే 325 కిలో మీటర్లు ప్రయాణిస్తుంది. ఇందులో డ్రైవర్ క్యాబిన్​లో ఒకటి, ప్రయాణికులు కూర్చునే దగ్గర మరో సెక్యూరిటీ కెమెరా ఉంటుంది. కరీంనగర్- 2 డిపో, వరంగల్, నిజామాబాద్, నల్గొండ, సూర్యాపేట, హైదరాబాద్- 2 డిపోల ద్వారా ఎలక్ట్రిక్ బస్సులను గ్రాస్ కాస్ట్ కాంట్రాక్ట్ (జీసీసీ) పద్ధతిలో నడిపేందుకు మేజర్స్ జేబీఎం సంస్థతో టీజీఆర్టీసీ సంస్థ ఇటీవల ఒప్పందం కుదుర్చుకుంది. వచ్చే ఏడాది మార్చిలోగా 500 ఎలక్ట్రిక్ బస్సులను జేబీఎం సంస్థ సమకూర్చనున్నది.

కరీంనగర్​కు 74 బస్సులు

కరీంనగర్- 2 డిపోకు 74 ఎలక్ట్రిక్ బస్సులు కేటాయించగా.. ఇందులో సూపర్ లగ్జరీ 35, డీలక్స్ -6, ఎక్స్ ప్రెస్ 33 బస్సులు ఉన్నాయి. ప్రస్తుతం 35 సూపర్ లగ్జరీ -బస్సులు డిపోకు చేరుకున్నాయి. కరీంనగర్- 2 డిపోలో బస్సుల చార్జింగ్ కోసం ఇప్పటికే 11 కేవీ విద్యుత్ లైన్లు, 14 చార్జింగ్ పాయింట్లు, మూడు ఎలక్ట్రిక్ ట్రాన్స్ ఫార్మర్లు బిగించారు. ఈ 35 బస్సులను కరీంనగర్ నుంచి జేబీఎస్ కు నాన్ స్టాప్ పద్ధతిలో నడపనున్నారు. ప్రతి 20 నిమిషాలకో బస్సు నడపాలని అధికారులు ప్లాన్ చేశారు. కరీంనగర్ – హైదరాబాద్ కు చార్జీని రూ.330గా నిర్ణయించారు. ఎలక్ట్రిక్ డీలక్స్, ఎక్స్ ప్రెస్ బస్సులు వచ్చాక మంథని, గోదావరిఖని, జగిత్యాల, సిరిసిల్ల, కామారెడ్డికి నాన్ స్టాప్ పద్ధతిలో నడపనున్నారు.  

త్వరలో నిజామాబాద్ 2 డిపోకు 67 బస్సులు

సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు దశలవారీగా 2,400 ఎలక్ట్రిక్ బస్సులను కొనుగోలు చేసేందుకు టీజీ ఆర్టీసీ కసరత్తు చేస్తున్నది. కరీంనగర్ జిల్లాకు పంపినట్లే త్వరలో నిజామాబాద్ -2 డిపోకు 67 ఎలక్ట్రిక్ బస్సులు (సూపర్ లగ్జరీ 13, ఎక్స్ ప్రెస్ 54), వరంగల్ కు 86, సూర్యాపేటకు 52, నల్లగొండకు 65, హైదరాబాద్ -2 డిపోకు 74 ఎలక్ట్రిక్ బస్సులు అందుబాటులోకి రానున్నాయి. నిజామాబాద్ – హైదరాబాద్ బస్సు చార్జీని రూ360గా నిర్ణయించారు.

మరిన్ని బస్సులు కొంటాం: మంత్రి పొన్నం

మహాలక్ష్మి స్కీమ్​తో ప్రయాణికుల రద్దీ పెరిగిందని, దానికి అనుగుణంగా బస్సులు పెంచుతున్నామని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. కొత్త బస్సులకు సరిపడా ఉద్యోగ ఖాళీలను భర్తీ చేస్తామని తెలిపారు. ఇప్పటికే 3,035 పోస్టుల నియామక ప్రక్రియ కొనసాగుతున్నదని అ న్నారు. రాష్ట్ర ప్రభుత్వ గ్రాంట్స్​తో మరిన్ని కొత్త బస్సులు కొనేందుకు టీజీఆర్టీసీ మేనేజ్​మెంట్ ప్రణాళికలు సిద్ధం చేస్తున్నదన్నారు. కరీంనగర్​లోని అంబేద్కర్ స్టేడియంలో ఆదివారం 35 ఎలక్ట్రిక్ సూపర్ లగ్జరీ బస్సుల ప్రారంభోత్సవానికి మంత్రి హాజరై మాట్లాడారు.

మహిళా సంఘాలకు ఆర్టీసీ అద్దె బస్సులు కేటాయించాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలిపారు. ఈ మేరకు మెప్మాతో సంప్రదింపులు జరుగుతున్నామన్నారు. ఎలక్ట్రిక్ బస్సులు నాన్​స్టాప్​గా నడుస్తాయని, తక్కువ సమయంలోనే కరీంనగర్ నుంచి హైదరాబాద్​కు చేరుకోవచ్చని టీజీఆర్టీసీ ఎండీ సజ్జనార్ అన్నారు. కాగా, ఈ కార్యక్రమానికి మంత్రి పొన్నం హాజరైనప్పటికీ.. మహాలక్ష్మి మీరే అంటూ కలెక్టర్ పమేలా సత్పతి చేతుల మీదుగా ఎలక్ట్రిక్ బస్సుల ప్రారంభోత్సవ రిబ్బన్​ను కట్ చేయించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు కవ్వంపల్లి సత్యనారాయణ, మేడిపల్లి సత్యం, సంజయ్ కుమార్, కరీంనగర్ మేయర్ సునీల్ రావు తదితరులు పాల్గొన్నారు.