- వరంగల్ మామునూరులో టీజీఎస్పీ కానిస్టేబుళ్ల ధర్నా
- మంచిర్యాలలో ర్యాలీ నిర్వహించిన పోలీసుల కుటుంబ సభ్యులు
- ‘ఒకే రాష్ట్రం – ఒకే పోలీస్ విధానం’ అమలు చేయాలని డిమాండ్
ఖిలా వరంగల్ (మామునూరు), వెలుగు : రాష్ట్రంలో ఏక్ పోలీస్ విధానాన్ని అమలు చేయాలంటూ టీజీఏస్పీ కానిస్టేబుళ్లు ఆందోళనకు దిగారు. రెండు రోజుల కింద పోలీసుల కుటుంబ సభ్యులు ధర్నా నిర్వహించగా.. శనివారం ఏకంగా కానిస్టేబుళ్లే డ్యూటీలకు దూరంగా ఉండి నిరసనకు దిగారు. మామునూరు నాల్గో బెటాలియన్ మెయిన్ గేట్ ఎదుట ఖమ్మం హైవేపై యూనిఫాంలో బైఠాయించి నిరసన తెలిపారు. విషయం తెలుసుకున్న మామునూరు సివిల్ పోలీస్ ఆఫీసర్లు వారిని సముదాయించే ప్రయత్నం చేసినా వినలేదు. ‘వి వాంట్ జస్టిస్’ అంటూ పెద్దపెట్టున నినాదాలు చేశారు. అనంతరం బెటాలియన్ గేట్ నుంచి కమాండ్ కంట్రోల్ రూం వరకు నినాదాలు చేస్తూ వెళ్లారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఏక్ పోలీస్ విధానాన్ని వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు.
ఇబ్రహీంపట్నంలో...
ఇబ్రహీంపట్నం, వెలుగు : ఏక్స్టేట్.. ఏక్ పోలీస్ కావాలంటూ రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో సాగర్ రహదారిపై 12వ బెటాలియన్ కానిస్టేబుళ్లు, కుటుంబ సభ్యులు ధర్నా, రాస్తారోకో నిర్వహించారు. పోలీసులందరికీ ఒకేరకమైన విధులు ఉండేలా చూడాలని డిమాండ్ చేశారు. ఆందోళన విరమించాలని మహేశ్వరం డీసీపీ సునీతారెడ్డి సముదాయించే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో బెటాలియన్ పోలీసుల కుటుంబ సభ్యులకు సివిల్పోలీసులకు మధ్య వాగ్వావాదం జరిగింది. అనంతరం కానిస్టేబుల్ఫ్యామిలీస్ అంబేద్కర్ విగ్రహానికి వినతిపత్రం అందజేసి వెనుదిరిగారు.
మంచిర్యాలలో పోలీసులు, వారి కుటుంబ సభ్యులు
మంచిర్యాల, వెలుగు : రాష్ట్రమంతటా ఒకే పోలీస్విధానాన్ని అమలు చేయాలని కోరుతూ మంచిర్యాల జిల్లా గుడిపేటలోని 13వ బెటాలియన్ పోలీసులు, వారి కుటుంబసభ్యులు రోడ్డెక్కారు. శనివారం జిల్లా కేంద్రంలోని రైల్వే ఓవర్ బ్రిడ్జిపై రాస్తారోకో నిర్వహించి అక్కడి నుంచి ఐబీ చౌరస్తా వరకు ర్యాలీ తీశారు. 24 గంటలు డ్యూటీలు వేయడం వల్ల తమ భర్తలు ఇండ్లకే రావడం లేదని, కనీసం అత్యవసర సమాయాల్లో కూడా లీవ్‌లు ఇవ్వడం లేదని కొందరు కంట తడిపెట్టుకున్నారు.
ఒకే చోట ఉద్యోగం చేయనీయకుండా రాష్ట్రమంతటా తిప్పుతున్నారని, బెటాలియన్‌లో చెట్లు నాటిస్తూ, గడ్డి పీకిస్తూ, ఆఫీసర్లకు ఊడిగం చేయిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సెలవుల విధానం మార్చడంతో పాటు పనిభారాన్ని తగ్గించాలని, ఐదేండ్ల పాటు ఒకే దగ్గర పోస్టింగ్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఏసీపీ ఆర్.ప్రకాశ్, సీఐ ప్రమోద్‌రావు వచ్చి నచ్చజెప్పడంతో ఆందోళన విరమించారు.