- ఆర్టికల్311 ప్రకారం ఉద్యోగాల నుంచి టీజీఎస్పీ సిబ్బంది డిస్మిస్!
- ఆందోళనలు చేస్తే క్రమశిక్షణ చర్యలు తప్పవు: డీజపీ జితేందర్
హైదరాబాద్, వెలుగు: టీజీఎస్పీ సిబ్బందిపై పోలీస్ శాఖ సంచలన నిర్ణయం తీసుకున్నది. పోలీస్ ఉద్యోగంలో ఉండి ధర్నాలు,ఆందోళనలకు నాయకత్వం వహిస్తున్న వారు, న్యూస్ చానల్స్‌కు ఇంటర్వ్యూలు ఇస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ చేసి ఆందోళనలను ప్రేరేపిస్తున్న వారిని గుర్తించింది. ఆర్టికల్ 311 ప్రకారం వారిని ఉద్యోగాల నుండి డిస్మిస్ చేసేందుకు నిర్ణయించినట్టు తెలిసింది.
తెలంగాణ స్పెషల్ పోలీస్ (టీజీఎస్పీ) సిబ్బంది ఆందోళనలు కరెక్ట్కాదని డీజీపీ జితేందర్ అన్నారు. యూనిఫామ్ సర్వీస్‌లో ఉండి నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్న వారిపై క్రమశిక్షణ చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు. టీజీఎస్పీ సిబ్బంది ఆందోళన నేపథ్యంలో డీజీపీ జితేందర్ శనివారం ప్రకటన విడుదల చేశారు. సమస్యలు ఏమైనా ఉంటే వారి కోసం నిర్వహిస్తున్న దర్బార్ కార్యక్రమంలో అధికారులు, కమాండెంట్లు, అడిషనల్ డీజీ బెటాలియన్స్‌కు తెలపాలని సూచించారు. వారి సమస్యలను పోలీస్ శాఖ పరిశీలిస్తుందని హామీ ఇచ్చారు.
సిబ్బంది యథావిధిగా వారి సాధారణ విధులను నిర్వహించాలని సూచించారు. రాష్ట్ర విభజనకు ముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో టీజీఎస్పీ పోలీసు సిబ్బంది విధి విధానాలు అమలు జరిగినట్టుగానే ప్రస్తుతం కొనసాగుతున్నాయని స్పష్టం చేశారు. భద్రత, ఆరోగ్య భద్రత వంటి సంక్షేమ పథకాలు ఇతర వసతులు కల్పిస్తున్నా.. టీజీఎస్పీ సిబ్బంది ఆందోళన చేయడం సమంజసం కాదన్నారు. సివిల్, ఆర్మ్డ్‌రిజర్వ్, స్పెషల్ పోలీస్ ఎంపిక రాత పరీక్షలో మెరిట్ ఆధారంగానే అభ్యర్థులు కోరుకున్న విధంగా జరిగాయన్నారు. దాదాపుగా అన్ని రాష్ట్రాలు ఈ రకమైన విధానాలనే అమలు చేస్తున్నాయని తెలిపారు.
సరెండర్ లీవ్స్ మంజూరు చేసినం
ఇతర ప్రభుత్వ విభాగాల ఉద్యోగులకు ఎవరికీ లేని విధంగా టీజీఎస్పీ సిబ్బందికి సరెండర్ లీవులు, అడిషనల్ సరెండర్ లీవులు మంజూరు చేశామని డీజీపీ వెల్లడిచారు. యూనిఫామ్ సిబ్బంది ఆందోళన కార్యక్రమాలు నిర్వహించడం తీవ్రమైన విషయంగా పరిగణించాల్సి వస్తుందన్నారు. పోలీస్ ఫోర్సెస్ (రిస్ట్రిక్షన్ ఆన్ రైట్స్)యాక్ట్, పోలీస్ (ఇన్సిటీమెంట్ ఆఫ్ డిస్‌ఎఫెక్షన్)యాక్ట్, పోలీస్ మ్యానువల్ ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.