హైదరాబాద్: తెలంగాణలో ఏక్ స్టేట్–ఏక్ పోలీస్ విధానం అమలు చేయాలని డిమాండ్ చేస్తూ రాష్ట్రవ్యాప్తంగా బెటాలియన్ కానిస్టేబుళ్లు గత కొన్ని రోజులుగా ఆందోళనలు చేస్తోన్న విషయం తెలిసిందే. బెటాలియన్ కానిస్టేబుళ్లకు మద్దతుగా వారి కుటుంబ సభ్యులు సైతం రోడ్డెక్కి నిరసన బాటపట్టారు. బెటాలియన్ కానిస్టేబుళ్ల ఆందోళనల నేపథ్యంలో ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సచివాలయ భద్రతలో మార్పులు చేపట్టింది.
సెక్రటేరియట్ సెక్యూరిటీ నుంచి తెలంగాణ స్పెషల్ పోలీసులను తొలగింగించింది. ఇప్పటి వరకు సచివాలయ భద్రతను టీజీఎస్పీ పర్యవేక్షించగా.. ఇక నుంచి ఎస్పీఎఫ్ పోలీసులు సెక్రటేరియట్ వద్ద గస్తీ కాయనున్నారు. ఈ మేరకు తెలంగాణ సెక్రటేరియట్ భద్రతలో మార్పులు చేస్తూ 2024, అక్టోబర్ 30న రాష్ట్ర డీజీపీ జితేందర్ ఉత్తర్వులు జారీ చేశారు.
ALSO READ | స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లపై హైకోర్టు కీలక ఆదేశాలు..
తెలంగాణ స్పెషల్ పోలీస్ల ఆందోళన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఇదిలా ఉంటే.. బెటాలియన్ కానిస్టేబుళ్ల ఆందోళనల దృష్ట్యా ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి భద్రతలో ప్రభుత్వం మార్పులు చేసింది. సీఎం రేవంత్ సెక్యూరిటీతో పాటు ఆయన ఇంటి వద్ద భద్రత నుండి బెటాలియన్ కానిస్టేబుళ్లను పోలీస్ శాఖ తొలగించింది. టీజీఎస్పీ స్థానంలో సీఎం నివాసం వద్ద సెక్యూరిటీని ఆర్మ్డ్ రిజర్వ్ (ఏఆర్) పోలీసులకు అప్పగించింది.