
హైదరాబాద్: గ్రూప్-1 పరీక్షల్లో అవకతవకలు జరిగినట్లు వస్తోన్న ఆరోపణలను తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TGSPSC) తీవ్రంగా ఖండించింది. కొందరు దురుద్దేశంతో కావాలనే గ్రూప్ 1 పరీక్షలపై దుష్ప్రచారం చేస్తున్నారని పేర్కొంది. ఈ ఆరోపణల వెనక ప్రైవేటు కోచింగ్ సెంటర్లు ఉన్నాయని తెలిపింది. లిమిటెడ్ మార్కుల పరీక్షల్లో అభ్యర్థులకు ఒకే మార్కులు రావడం సహజమని.. అంతమాత్రాన పరీక్షల్లో అవకతవకలు జరిగినట్లు కాదని వివరణ ఇచ్చింది.
ప్రొటోకాల్ ప్రకారమే నిపుణులతో జవాబు పత్రాల వాల్యుయేషన్ జరిగిందని తెలిపారు. ఎస్టీ కేటగిరి టాపర్‌పైనా దుష్ప్రచారం జరుగుతోందన్నారు. మహిళల కోసం కోఠి ఉమెన్స్ కాలేజీలో ప్రత్యేక సెంటర్ ఏర్పాటు చేశామని.. దాదాపు 25 శాతం మంది మహిళా అభ్యర్థులు అక్కడే పరీక్ష రాశారు. కాబట్టి అక్కడి నుంచే మెజారిటీ మహిళలు ఎంపికయ్యారని క్లారిటీ ఇచ్చింది.
►ALSO READ | అర్హులైన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇళ్లు, రేషన్ కార్డు: ఎమ్మెల్యే వివేక్
కాగా, గ్రూప్1 పరీక్షపై బీఆర్ఎస్ నేత, ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి సంచలన ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. గ్రూప్ 1 పరీక్షలో పెద్ద కుంభకోణం జరిగిందని ఆయన ఆరోపించారు. ‘‘గ్రూప్-1 ఫలితాలు దేశంలోనే పెద్ద కుంభకోణం. ప్రిలిమ్స్‌కు ఒక హాల్‌టికెట్, మెయిన్స్‌కు మరో హాల్‌టికెట్ ఇవ్వడం దేశ చరిత్రలో ఎప్పుడూ జరగలేదు. ఇక్కడే కుంభకోణం మొదలైంది. 21 వేల 93 మంది పరీక్షలు రాశారు.. కానీ 21 వేల 103 మందికి ఫలితాలు ఎలా ఇచ్చారు..?’’ అని ఆరోపణలు చేశారు. గ్రూప్ 1 పరీక్షల అవకతవకలపై సీబీఐ దర్యాప్తు జరిపించాలని డిమాండ్ చేశారు. ఈ క్రమంలో గ్రూప్ 1 పరీక్షలపై వస్తోన్న ఆరోపణలపై పై విధంగా టీజీఎస్పీఎస్సీ క్లారిటీ ఇచ్చింది.